- రైతులు, మత్స్యకారులతో మాటముచ్చట
- కుటుంబసమేతంగా యాదగిరిగుట్టకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
- యాదగిరి నర్సన్న, సంగెం భీమలింగం స్వామికి ప్రత్యేక పూజలు
- పాదయాత్ర అనంతరం బహిరంగ సభ
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి
యాదాద్రి, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా ‘మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర’ చేయనున్నారు. ఆయన ముందుగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మూసీ నది వెంట 5 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. ఈ సందర్భంగా మూసీని పరిశీలించి, దాని కాలుష్యం వల్ల ఇబ్బందులు పడ్తున్న వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడతారు. అనంతరం అక్కడే నిర్వహించే బహిరంగ సభలో మూసీ కాలుష్యం, ప్రభుత్వం చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తారు.
సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు గురువారం పరిశీలించారు. కొండపైన, కొండ కింద సీఎం సందర్శించే ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను ఆలయ ఈవో భాస్కర్ రావుతో కలిసి పర్యవేక్షించారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ సీఎం పర్యటన షెడ్యూల్..
సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట్ నుంచి హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా యాదగిరిగుట్టకు బయలుదేరుతారు. ఉదయం 10 గంటలకు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం 11:30 గంటలకు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి పనులు, ముఖ్యంగా స్వర్ణతాపడం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు రోడ్డు మార్గంలో వలిగొండ మండలం సంగెం వెళ్లి మూసీని సందర్శిస్తారు. అక్కడే నది మధ్యలో ఉన్న భీమలింగం స్వామిని దర్శించుకొని పూజలు చేస్తారు. మూసీలో కాలుష్యం ఎలా ఉందో పరిశీలిస్తారు. ఆ తర్వాత మూసీ వెంట ధర్మారెడ్డి కాల్వ వరకు పాదయాత్రగా వెళ్తారు. అక్కడి నుంచి నాగిరెడ్డిపల్లి మెయిన్‌రోడ్డు వైపు నడుస్తారు. మొత్తంగా మూసీ వెంట గంటన్నర పాటు 5 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు.
ఈ టైమ్ లోనే మూసీ కాలుష్యంపై రైతులు, మత్స్యకారులతో మాట్లాడుతారు. కాలుష్యం కారణంగా వాళ్లకు కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. ప్రభుత్వం చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు గురించి వాళ్లకు వివరిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు.
మూసీ ప్రక్షాళనతో ప్రజల జీవితాల్లో మార్పు: తుమ్మల
మూసీ ప్రక్షాళనతో లక్షలాది మంది జీవితాల్లో మార్పు తేవాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘‘ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన మూసీ.. ఇప్పుడు మురికి కూపంగా మారిపోయింది. మూసీ ప్రక్షాళనకు గత ప్రభుత్వాలు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మూసీకి పునరుజ్జీవం పోయడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
సాగు, తాగునీరు అందించడంతో పాటు నది పరీవాహక ప్రాంతంలోని ప్రజల జీవన పరిస్థితులను మార్చేందుకు మా ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపడుతున్నది” అని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా దీన్ని పూర్తి చేస్తామన్నారు. మూసీ పునరుజ్జీవం ద్వారా ఇక్కడి పంటలు, ప్రాణులు, ప్రజలను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయడం అభినందనీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంత్రుల వెంట ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.