
జనగామ, వెలుగు: డిజిటల్ బ్యాంకింగ్ సేవలతో ఎంతో ప్రయోజనకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి అన్నారు. జనగామలోని పార్టీ జిల్లా ఆఫీస్ లో శనివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా వర్చువల్ ద్వారా 75 డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణలోని ఎస్బీఐలో డిజిటల్ సేవల ప్రారంభాన్ని తిలకించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇక్కడకు వస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సౌడ రమేష్, శివరాజ్ యాదవ్, దండు శ్రీనివాస్, సంపత్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
రియల్ ఎస్టేట్‌లో వరంగల్ ప్రగతి:మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హనుమకొండ సిటీ, వెలుగు: రాష్ట్రం ఏర్పాటయ్యాక రియల్ ఎస్టేట్ రంగం అద్భుత ప్రగతి సాధించిందని, వరంగల్ నగరంలో ప్రస్తుతం రూ.2860 కోట్ల విలువైన 84 ప్రాజెక్టులు నడుస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం హనుమకొండ హంటర్ రోడ్ లోని విష్ణుప్రియ గార్డెన్స్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో 2022ను ఆయన ప్రారంభించారు. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ హబ్, సాప్ట్ వేర్ కంపెనీలు, మెగా టెక్స్ టైల్ పార్కు, ఎన్ఐటీ లాంటి సంస్థలు ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ హనుమకొండలో క్రెడాయ్ ప్రాపర్టీ షో ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో షో నిర్వాహకులు,తెలంగాణ క్రెడాయ్ ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి, క్రెడాయ్ వరంగల్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు సత్యనారాయణరెడ్డి,మనోహర్ పాల్గొన్నారు.
లక్కీ డ్రా పేరిట మోసం
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: లక్కీ డ్రా స్కీం పేరిట సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేసి నిర్వాహకులు మోసం చేశారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తమ డబ్బు కాజేసిన నిర్వాహకులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని షాప్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఉమా మహేశ్వర్ ఎంటర్ ప్రైజస్ లక్కీ డ్రా స్కీమ్ పేరిట గ్రామాల్లో తిరుగుతూ ఆకర్షణీయమైన బహుమతులు కార్లు, బైక్‌లు, టీవీలు అంటూ పలువురి నుంచి డబ్బు వసూలు చేశారు. టైం అయిపోయినా బహుమతులు, నగదు ఇవ్వకపోవడంతో అడిగేందుకు వెళ్లగా నిర్వాహకులు పరారయ్యారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
జైల్ వార్డెన్‌కు ఆర్థికసాయం
జనగామ అర్బన్, వెలుగు: ఈ నెల 6న జనగామలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా సబ్జైల్లో జైల్ వార్డెన్‌గా పనిచేస్తున్న గొట్టి శ్రీకాంత్‌కు తీవ్రంగా గాయపడటంతోపాటు తండ్రిని, భార్యను కోల్పోయారు. బాధితుడు శ్రీకాంత్‌కు తోటి సిబ్బంది, జైళ్లశాఖ అధికారులు ఆర్థిక సాయం అందజేశారు. మొత్తం రూ. 6 లక్షల్లో ట్రీట్మెంట్ ఖర్చులు పోను మిగిలిన రూ.2 లక్షల 27 వేలు శనివారం శ్రీకాంత్ పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్ పేపర్లను కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ డి. శ్రీనివాస్, జనగామ, కరీంనగర్ జైలు సూపరింటెండెంట్లు కె. శ్రీనివాస్, సమ్మయ్య, వరంగల్ జిల్లా జైళ్ల శాఖ అధికారి జి. విజయ దేవి పాల్గొన్నారు.
ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ల ఇండస్ట్రీపై టాస్క్ ఫోర్స్ దాడి
వరంగల్ క్రైం, వెలుగు: నిషేధిత ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ తయారు చేస్తున్న ఇండస్ట్రీపై వరంగల్ టాస్క్ ఫోర్స్పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో సుమారు రూ.6.99లక్షల విలువైన ప్లాస్టిక్ ప్లేట్లు, ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ తిమ్మాపూర్ సమీపంలోని పెన్షన్ పురలో సుంగ సంజయ్ అనే వ్యక్తి సుగుణ ఇండస్ట్రీస్ పేరుతో నిషేధిత ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ల బిజినెస్ చేస్తున్నాడు. శనివారం టాస్క్‌ఫోర్స్ సీఐలు వెంకటేశ్వర్లు, నరేశ్ కుమార్, పీసీబీ, మున్సిపల్ ఆఫీసర్లతో కలిసి ఇండస్ట్రీ లో తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లను పట్టుకున్నట్లు చెప్పారు. తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్స్ సోమలింగం, మాధవ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
‘పట్టణ ప్రగతి’ సమస్యలను పరిష్కరించండి
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం బల్దియా హెడ్ ఆఫీస్‌లో పట్టణ ప్రగతిపై ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 4వ విడత పట్టణ ప్రగతిలో గుర్తించిన శానిటేషన్, ఇంజనీరింగ్, ఎలక్ర్టికల్, రెవెన్యూ పన్ను, ఆరోగ్య, హార్టికల్చర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వన్ టైం స్కీం ఈ నెల 31తో ముగుస్తున్నందున పన్ను చెల్లింపుదారులు, బకాయిదారులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ అనిసుర్ రషీద్, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సీపీ వెంకన్న, డీసీలు జోనా, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహించాలి
పట్టణ సమాఖ్య ఆర్పీలు రెగ్యులర్‌గా సమావేశాలను నిర్వహించాలని బల్దియా మేయర్ సుధారాణి అన్నారు. శనివారం బల్దియా హెడ్ ఆఫీస్‌లో ఆదర్శ పట్టణ సమాఖ్య ఆర్పీలతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నవంబర్ లోగా అన్ని సమాఖ్య ఎస్‌ఎల్‌ఎఫ్‌ల ఆడిటింగ్, జనరల్ బాడీ మీటింగ్‌లను పూర్తి చేయాలని అన్నారు.
కరెంట్ షాక్‌తో రైతు మృతి
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: కరెంట్‌షాక్‌తో ములుగు జిల్లా వెంకటాపూర్మండల కేంద్రానికి చెందిన జంగిలి స్వామి( 53) అనే రైతు చనిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటాపూర్ లో మెయిన్ రోడ్డు కు ఆనుకొని ఉన్న సొంత పొలంలో స్వామి శనివారం ఎడ్లను మేపుతున్నాడు. ఈక్రమంలో ఎద్దుకు ఉన్న తాడు కరెంట్పోల్సపోర్ట్ వైరుకు ఇరుక్కుంది. దాన్ని తీసే క్రమంలో సర్వీస్ వైర్ సపోర్ట్ వైర్ కు తాకడంతో కరెంట్సప్లై అయ్యి షాక్ కొట్టింది. వెంటనే సమీప రైతులు ములుగు ఏరియా హాస్పిటల్‌కు తరలిస్తుండగా స్వామి మార్గమధ్యలో చనిపోయాడు.
గుండెపోటుతో డాక్టర్ ఉషారాణి మృతి
నర్సంపేట, వెలుగు: నర్సంపేట టౌన్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ చామర్తి ఉషారాణి ఉత్తరాంచల్రాష్ట్రంలోని బద్రీనాథ్‌లో శనివారం గుండెపోటుతో చనిపోయారు. నాలుగు రోజుల కింద భర్త డాక్టర్నందకిషోర్, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి నార్త్‌ఇండియాలోని తీర్థయాత్రలకు వెళ్లారు. శనివారం ఉదయం బద్రీనాథ్ టూరిస్టు స్పాట్లో డాక్టర్ ఉషారాణికి గుండెపోటు వచ్చి అక్కడే చనిపోయినట్లు ఆమె బంధువులు తెలిపారు. నర్సంపేట ప్రాంతంలో పేరుగాంచిన గైనకాలజిస్టుగా 40 ఏళ్ల పాటు వైద్య సేవలు అందించారు. ఆదివారం రాత్రికి ఆమె డెడ్‌బాడీ నర్సంపేటకు చేరుకోనుంది.
విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దాలి
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని, ప్రణాళికబద్ధంగా బోధిస్తూ లక్ష్యం దిశగా ముందుకు సాగాలని ములుగు డీఈవో పాణిని ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం జవహర్ నగర్ మోడల్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా డీఈవో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఎంఈవో శ్రీనివాస్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కరుణాకర్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సతీష్ యాదవ్, సర్పంచ్ రమ పాల్గొన్నారు.
ప్రభుత్వ హాస్పిటల్స్ లో డెలివరీలను ప్రోత్సహించాలి
కాజీపేట,వెలుగు: ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రసవాలను ప్రోత్సహించాలని హనుమకొండ జిల్లా డీఎంహెచ్ వో బి.సాంబశివరావు అన్నారు. కాజీపేట మండలం కడిపికొండ పీహెచ్సీలో ఆరోగ్య కార్యక్రమాలు, సిబ్బంది పనితీరుపై ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకునేలా ఐసీడీఎస్ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. దోమల నివారణకు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో యాకుబ్ పాషా, టీబీ కంట్రోల్ఆఫీసర్మల్లికార్జున్, ఇమ్యునైజేషన్ ఆఫీసర్గీతాలక్ష్మీ, డాక్టర్లు ఉమశ్రీ, వాణిశ్రీ పాల్గొన్నారు.
రోడ్డేసేదాక గ్యాస్ లారీలను పోనియ్యం
గ్యాస్ లారీలను అడ్డుకున్న పంగిడిపల్లి గ్రామస్తులు
కమలాపూర్, వెలుగు: పంగిడిపల్లిలో రోడ్డేసేదాక గ్యాస్లారీలను పోనివ్వమని గ్రామస్తులు శనివారం ఆందోళన చేపట్టారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డంతా గుంతలుగా మారి ఇబ్బందులు పడుతున్నామని రోడ్డుకు అడ్డంగా కర్ర దుంగలు వేసి లారీలను అడ్డుకున్నారు. రెండు నెలల కింద రోడ్డు బాగు చేయాలని గ్రామస్తులు టెంట్‌వేసి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. గ్రామస్తులు మాట్లాడుతూ రోడ్డు వేయమని ఎన్నిసార్లు చెప్పినా పాలకులు, ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్నారు.
కలాంకు ఘన నివాళి
తొర్రూరు, వెలుగు: మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత మాజీ రాష్ట్రపతి శఅబ్దుల్ కలాం జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో తొర్రూర్ లో ఘనంగా నిర్వహించారు. కలాం ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య, తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, జిల్లా కార్యదర్శి పరుపాటి రాంమోహన్ రెడ్డి, బీసీ మోర్చా రాష్ట్ర నాయకులు జలగం వెంకన్న, పూసాల శ్రీమాన్, యాకయ్య, రాజేశ్పాల్గొన్నారు.
వేధింపులతో వాచ్మెన్ సూసైడ్
సెల్ఫీ వీడియోలో వెల్లడి
వరంగల్‌సిటీ, వెలుగు: అపార్ట్మెంట్ ఓనర్ వేధింపులు భరించలేక వాచ్మెన్పురుగుమందు తాగి సూసైడ్చేసుకున్నాడు. తన చావుకు అపార్ట్మెంట్ ఓనర్‌తోపాటు మరో ఇద్దరు కారణమంటూ మృతుడు సూసైడ్‌కు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్( 48) కుటుంబంతో సహా ఆరు నెలలుగా వరంగల్ కొత్తవాడలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. జీతం విషయంలో శ్రీనివాస్, అపార్ట్మెంట్ఓనర్మధ్య వాగ్వాదం జరిగింది. అపార్ట్మెంట్ ఓనర్కులం పేరుతో దూషించి, కొట్టాడని మృతుడి భార్య తెలిపింది. దీనికి తీవ్ర మనస్తాపం చెందిన శ్రీనివాస్ఈనెల10న పురుగు మందు తాగాడు. భార్య వెంటనే అతడిని ఎంజీఎంకు తరలించగా చికిత్సపొందుతూ శనివారం చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ పోలీసులు తెలిపారు.
కుమ్రం భీం ఆశయాలను కొనసాగిద్దాం
మహాముత్తారం, వెలుగు: ఆదివాసీల ఆరాధ్యదైవం కుమ్రంభీం ఆశయాలను కొనసాగించాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధుకర్పిలుపునిచ్చారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామన్‌పల్లిలో ఆదివాసీల ఆధ్వర్యంలో కుమ్రంభీం వర్ధంతిని నిర్వహించారు. కుమ్రంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన భీం ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. మంథని నియోజకవర్గంలోని పలిమెల, కాళేశ్వరం, బోర్లగూడెం, కనుకునూర్ గ్రామాల్లో కుమ్రం భీం విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా యువజన నాయకులు జక్కు రాకేశ్, ఆదివాసీ సంఘాల నాయకులు, టీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు.
.
బల్దియా ఉద్యోగి సస్పెన్షన్
వరంగల్‌సిటీ, వెలుగు: బల్దియా అవినీతి ఆఫీసర్‌ను శనివారం సస్పెండ్ చేశారు. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ కాశిబుగ్గ సర్కిల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రబ్బాని ఇటీవల ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన విషయం విధితమే. ఈ మేరకు అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
మత్తు మందు వికటించి..ఎంజీఎంలో రోగి మృతి
వరంగల్సిటి, వెలుగు: వరంగల్ఎంజీఎంలో మత్తు మందు వికటించి ఓ రోగి చనిపోయాడు. ఇటీవల ఓ బాలుడు మత్తు మందు డోసు ఎక్కువై చనిపోవడం మరవకముందే మరో ఘటన జరిగింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన కుండ వెంకటేశ్వర్లు (41) గాల్ బ్లాడర్‌లో నొప్పితో ఈనెల 12న ఎంజీఎంకు వచ్చారు. శనివారం ఆపరేషన్ థియేటర్‌కు తరలించి మత్తు ఇవ్వగా మందు వికటించి చనిపోయినట్లు మృతుడి బంధువులు తెలిపారు. ఈ విషయం చెప్పకుండా డాక్టర్లు మృతుడిని ఆర్ఐసీయూకు తరలించారని చెప్పారు. కాగా వెంకటేశ్వర్లు గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.