అవిశ్వాసంపై హైటెన్షన్
క్యాంపులో కౌన్సిలర్లు,
విప్ జారీ చేసిన బీఆర్‌ఎస్
యాదాద్రి/మోత్కూరు, వెలుగు : యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. బీఆర్‌ఎస్‌కు చెందిన చైర్మన్‌పై సొంత పార్టీ కౌన్సిలర్లే ఇటీవల అవిశ్వాస నోటీసు ఇచ్చారు. దీంతో శుక్రవారం భువనగిరి ఆర్డీవో అమరేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోత్కూరు మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 7, కాంగ్రెస్ 5 వార్డుల్లో గెలిచింది. అప్పటి ఎమ్మెల్యే గాదరి కిశోర్ ప్రోద్బలంతో కాంగ్రెస్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌లో చేరగా ఆ పార్టీకి తీపిరెడ్డి సావిత్రి చైర్‌పర్సన్‌గా, వెంకటయ్య వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం మారడంతో ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్‌ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కలిసి గత నెల 20న చైర్మన్‌పై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు.
ఎనిమిది మంది హాజరైతేనే కోరం కలెక్టర్‌కు నోటీసు ఇచ్చిన వెంటనే బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు, కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కౌన్సిలర్లు క్యాంప్‌నకు వెళ్లిపోయారు. వీరంతా 20 రోజులుగా తిరుపతి, అరుణాచలం, బాపట్ల సహా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం 12 మంది కౌన్సిలర్లలో కనీసం 8 మంది హాజరైతేనే అవిశ్వాసం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. దీంతో క్యాంప్‌లో ఉన్న కౌన్సిలర్లు శుక్రవారం ఉదయం 11 గంటల్లోపు మున్సిపాలిటీకి చేరుకోవాల్సి ఉంటుంది. 8 మంది సభ్యులు మీటింగ్‌కు హాజరుకాని పక్షంలో రెండు సార్లు వాయిదా వేస్తారు. అయినా రాకపోతే మీటింగ్‌ను నిరవధికంగా వాయిదా వేయనున్నారు.
విప్ జారీ చేసిన బీఆర్‌ఎస్ పార్టీ మారిన కౌన్సిలర్లను తిరిగి రప్పించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి గత నెల 30న విప్ జారీ చేశారు. విప్‌ను ఉల్లంఘించిన కౌన్సిలర్లపై వేటు పడే అవకాశం ఉంది. ఒక వేళ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం నెగ్గినట్టయితే ప్రస్తుత వైస్‌చైర్మన్ వెంకటయ్య ఇన్‌చార్జ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. చైర్మన్ పోస్టు ఖాళీ అయినట్లు ప్రభుత్వం నోటిఫై చేశాక చైర్మన్ఎన్నిక కోసం మరో తేదీని నిర్ణయించి సమావేశం నిర్వహిస్తారు. చైర్‌పర్సన్ రేసులో గుర్రం కవిత ఉన్నట్లు తెలుస్తోంది.