ఇయ్యాల టీఆర్​ఎస్​ ప్లీనరీ.. జాతీయ రాజకీయాలే ఎజెండా!

ఇయ్యాల టీఆర్​ఎస్​ ప్లీనరీ.. జాతీయ రాజకీయాలే ఎజెండా!
  • నేషనల్‌‌ పార్టీనా, ప్రత్యామ్నాయ కూటమా?
  • కేసీఆర్‌‌ కీలక ప్రకటన చేస్తరన్న కేటీఆర్‌‌
  • హెచ్‌‌ఐసీసీలో అట్టహాసంగా ఏర్పాట్లు
  • ఉదయం 11 గంటలకు ప్రసంగించనున్న టీఆర్ఎస్ చీఫ్ 

హైదరాబాద్‌, వెలుగు: జాతీయ రాజకీయాలే ఎజెండాగా టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారు. హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్న పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం, ప్రతినిధుల సభ ఇందుకు వేదిక కానుంది. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు సంక్షోభంలోనూ 24 గంటల కరెంట్‌ సరఫరాను దేశవ్యాప్తంగా అమలు చేయడమే లక్ష్యంగా కేసీఆర్‌ విధాన ప్రకటన చేయనున్నారు. జాతీయ స్థాయి పార్టీని ప్రకటిస్తారా, లేక బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమిని ఏర్పాటు చేస్తారా అనేది బుధవారమే క్లారిటీ రానుంది. 

అందుకే ప్రతినిధుల సభ

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ నిర్వహించడానికి జాతీయ రాజకీయాలపై కీలక ప్రకటనే కారణమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ సాధన కోసం ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చింది. 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, ఎనిమిదేళ్లు అధికార పార్టీగా ప్రజల కోసం చేసిన పనులను చెప్పుకునేందుకే ఈ సభ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపైనా చర్చించి సభలో తీర్మానం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ చీఫ్‌ కేసీఆర్‌.. జెండా ఆవిష్కరించి ప్రసంగిస్తారు. తర్వాత తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిని ఆమోదిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రతినిధుల సభ ముగుస్తుంది. ఆవిర్భావ ఉత్సవాలకు హెచ్‌ఐసీసీలో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. 3,500 మంది కూర్చునేలా సీటింగ్‌ ఏర్పాటు చేశారు. పార్టీ ప్రతినిధులు 3 వేల మంది, ఇతర ఆహ్వానితులు, మీడియా ప్రతినిధులు 500 మంది వరకు సభా ప్రాంగణంలోకి అనుమతిస్తారు. బార్‌ పాస్‌లు ఉన్న వాళ్లనే లోనికి పంపనున్నారు.

జాతీయ రాజకీయాలపై ప్రకటన: కేటీఆర్‌

జాతీయ రాజకీయాలపైనా విధానపరమైన ప్రకటన చేస్తామని మంత్రి కేటీఆర్​ అన్నారు. పార్టీకి 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని, కేవలం 3 వేల మందిని మాత్రమే ప్రతినిధుల సభకు ఆహ్వానించామన్నారు. వారు తప్ప ఇంకెవ్వరూ హెచ్‌ఐసీసీకి రావొద్దని విజ్ఞప్తి చేశారు. హెచ్‌ఐసీసీలో పార్టీ ప్రతినిధుల సభ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. గ్రామాలు, వార్డులు, డివిజన్లలోనూ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అందరినీ ఆహ్వానించ లేకపోతున్నం దుకు క్షమించాలన్నారు. ఆహ్వానితులు ఉదయం 9కే వేదిక వద్దకు చేరుకొని రిజిస్ట్రేషన్‌ చేయించుకో వాలని, 10 గంటలకు సభా ప్రాంగణంలోకి రావాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ గులాబీ రంగు డ్రెస్‌లు వేసుకొని రావాలన్నారు. సభలో చేసే తీర్మానాలు ముఖ్యమైనవని, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలకు ఈ తీర్మానాల్లో సమాధానం దొరుకుతుందని చెప్పారు. మన పథకాలను కేంద్రం కాపీ కొట్టిందన్నారు. నిత్యావసరాలు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలపై ప్రతినిధుల సభలో చర్చించి 11 తీర్మానాలు ఆమోదిస్తామన్నారు.