ముద్ర బ్యాంక్ ఉద్యోగాలంటూ వసూళ్లు
రూ.కోటికి పైగా బురిడీ
కొట్టించిన దుండగుడు
శాయంపేట, వెలుగు: ముద్ర బ్యాంక్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ దుండగుడు నిరుద్యోగుల వద్ద రూ.కోటికి పైగా వసూలు చేసి పారిపోయాడు. బాధితుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన ఉప్పు నర్సయ్య తాను ముద్ర బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్‌గా చెప్పుకొని తిరిగాడు. ముద్ర బ్యాంక్ లో ఉద్యోగాలిప్పిస్తానని 50 మందికి పైగా నిరుద్యోగుల నుంచి రూ.కోటికి పైగా వసూలు చేశాడు. అటెండర్ పోస్టుకు రూ.70వేలు, అకౌంటెంట్ పోస్టుకు రూ.లక్ష, క్యాషియర్‌కు రూ.లక్షన్నర, మేనేజర్ పోస్టుకు రూ.2 లక్షల చొప్పున వసూలు చేశాడు. వారి వద్ద పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికేట్లు కూడా తీసుకున్నాడు. 2018లో ఈ సంఘటన జరగగా.. ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చి నిలదీశారు. డబ్బులు తిరిగి ఇస్తానని రెండేండ్లుగా తిప్పించుకున్నాడు. తాజాగా సర్సయ్య పారిపోవడంతో బాధితులు శాయంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మోసపోయిన వారిలో శాయంపేట, పత్తిపాక గ్రామాలకు చెందినవారు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ప్లాస్టిక్ వాడకంపై వ్యాపారులకు ఫైన్లు
జనగామ అర్బన్, వెలుగు: జనగామ జిల్లాకేంద్రంలోని పలు షాపుల్లో మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్ ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ వినియోగిస్తున్న ఓనర్లకు ఫైన్లు విధించారు. 35 కిలోల కవర్లు సీజ్ చేసి, రూ.34వేల ఫైన్లు వసూలు చేశారు. నిషేధిత ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల ఆఫీసర్లు రవీందర్, మల్లిగారి మధు, బొట్ల రవి, నోముల నర్సయ్య తదితరులున్నారు.
ప్రశ్నించినందుకు అరెస్టులా?
స్టేషన్ ఘన్ పూర్, వెలుగు: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కు అని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు బండి సంజయ్ ని అరెస్టు చేయడం తగదని బీజేపీ రాష్ట్ర నాయకుడు మాదాసు వెంకటేశ్ అన్నారు. మంగళవారం స్టేషన్ ఘన్ పూర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రజాభిమానం ముందు, కేసీఆర్ అవినీతి పనిచేయదని.. బండి సంజయ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పై యుద్ధం చేస్తామని చెప్పారు. ప్రజాసంగ్రామ యాత్రతో ఎక్కడ అధికార పీఠం కదులుతుందోననే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్, పాదయాత్రపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు గట్టు క్రిష్ణ, నాయకులు గుర్రపు బాబురావు ఉన్నారు.
రామప్పకు ఫారెనర్లు
వెంకటాపూర్( రామప్ప), వెలుగు: రామప్ప ఆలయానికి టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం యూరోప్‌కు చెందిన టూరిస్టులు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. గైడ్ ద్వారా రామప్ప హిస్టరీని తెలుసుకున్నారు. టెంపుల్ అద్భుతంగా ఉందని కొనియాడారు.
వీఆర్ఏల భిక్షాటన
వెలుగు నెట్ వర్క్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏల నిరసనలు కొనసాగుతున్నాయి. 29వ రోజు వీఆర్ఏలు భిక్షాటన చేసి, తమ ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె చేపట్టి నెల రోజులు కావొస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయాలని, అర్హులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
బచ్చన్నపేట, వెలుగు: విద్యారంగ సమస్యలతో పాటు టీచర్ల సమస్యలు పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన బచ్చన్నపేట మండలకేంద్రంతో పాటు పోచన్నపేట, చిన్నరామచర్ల గ్రామాల్లోని స్కూళ్లను సందర్శించారు. విద్యా సంవత్సరం మొదలై నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంకా యూనిఫామ్, బుక్కులు అందించకపోవడం దారుణమన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు కూడా పెండింగ్‌లో పెట్టడం సరికాదన్నారు. స్కూళ్ల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మైనర్ బాలికతో పెండ్లి ఆపై వేధింపులు..
నిందితుడిపై పోక్సో కేసు
నర్సంపేట, వెలుగు: 16 ఏండ్ల మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి పెండ్లి చేసుకున్నాడు. ఆపై వేధింపులకు గురి చేశాడు. దీంతో సదరు బాలిక చైల్డ్‌లైన్.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఖానాపురం మండలానికి చెందిన ఓ గిరిజన కుటుంబం కొన్నేండ్ల కింద నర్సంపేట మండలానికి వలస వచ్చింది. వీరికి ఓ కుమార్తె ఉంది. తల్లితండ్రులు కూలీ పనులకు వెళ్లే క్రమంలో ఓ వ్యక్తి ఆ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆపై పెండ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులు బాగానే ఉండి, ఆ తర్వాత ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సదరు బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఈ విషయాన్ని టౌన్‌సీఐ పులి రమేశ్ ధ్రువీకరించారు.
కేజీబీవీలో కరోనా కలకలం
రేగొండ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో ఇద్దరు స్టూడెంట్లకు కరోనా సోకింది. దీంతో మిగితా స్టూడెంట్లు, స్టాఫ్ భయాందోళన చెందుతున్నారు. ఇటీవల హాస్టల్లో కొంతమంది స్టూడెంట్లు అనారోగ్యంతో బాధపడుతుండగా, స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ఇందులో కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేశారు. ఏడు, ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. మరోపది మందికి లక్షణాలు ఉండడంతో వారందరినీ ఇంటికి పంపారు.
మైనింగ్ సంస్థలపై చర్యలు తీసుకోవాలి
ఆత్మకూరు, వెలుగు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో పర్యావరణ అనుమతులు లేకుండా నడుస్తున్న మైనింగ్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు మండలి రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మంగళవారం తహసీల్దార్ సురేశ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దాపురంలో రెండు మైనింగ్ సంస్థలు, కొత్తగట్టులో ఐదు క్రషర్లు కంపెనీలు ఎలాంటి పర్యావరణ అనుమతులు తీసుకోలేదన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బండి సంజయ్ అరెస్టుపై ఆందోళనలు
స్టేషన్ ఘన్ పూర్ లో బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీ లీడర్లు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలుచోట్ల రాస్తారోకో నిర్వహించగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఇంకొన్నిచోట్ల బీజేపీ లీడర్లను ముందస్తుగానే అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న ప్రజాసంగ్రామ యాత్రను టీఆర్ఎస్ భగ్నం చేయడం తగదన్నారు. ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని మండిపడ్డారు.
డెంగ్యూతో బాలిక మృతి
వరంగల్ ఎంజీఎంలో ఘటన
నెక్కొండ, వెలుగు: డెంగ్యూతో ఓ బాలిక చనిపోయింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంటకు చెందిన దొనికెన ఏకాంబరం చిన్నకూతురు సాత్విక(10) అదే గ్రామంలోని ప్రభుత్వ బడిలో ఏడో తరగతి చదువుతోంది. కొద్దిరోజులుగా జ్వరం రావడంతో ఆమెను హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. సాత్వికకు డెంగ్యూ సోకిందని డాక్టర్లు చెప్పారు. అక్కడ కొన్నిరోజుల పాటు చికిత్స తీసుకుంది. హాస్పిటల్ ఫీజులు ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు ఆమెను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఆమె మంగళవారం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాన్వొకేషన్‌కు ఏర్పాట్లు పూర్తి
కేయూ వీసీ తాటికొండ రమేశ్
హసన్ పర్తి, వెలుగు: ఈ నెల 25న నిర్వహించే కేయూ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వీసీ తాటికొండ రమేశ్ చెప్పారు. ఈ వేడుకలకు చీఫ్ గెస్టులుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సెర్బ్ సెక్రటరీ సందీప్ వర్మ పాల్గొననున్నట్లు వెల్లడించారు. మంగళవారం కేయూలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి 56మందికి పీహెచ్ డీ పట్టాలు, 192 మంది గ్రాడ్యుయేట్లకు గోల్డ్ మెడల్స్ అందజేస్తామన్నారు. సమయం లేనందున గవర్నర్ చేతుల మీదుగా కొందరికే పట్టాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కాగా, మెడల్స్ తీసుకునే వాళ్లు తమ వెంట ఆధార్ కార్డు తీసుకురావాలని, ముందుగానే పాసులు తీసుకోవాలని కోరారు. కాన్వొకేషన్ నిర్వహణకు 11 కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వెంకట్ రామ్ రెడ్డి, ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఆఫీసర్ ఆచార్య మల్లారెడ్డి తదితరులున్నారు.