Gold Rates: ఈ బంగారం ధర ఏంటో.. హైదరాబాద్లో మళ్లీ భారీగా పెరిగింది..!

Gold Rates: ఈ బంగారం ధర ఏంటో.. హైదరాబాద్లో మళ్లీ భారీగా పెరిగింది..!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ(నవంబర్ 8, 2024) మళ్లీ పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 850 రూపాయలు పెరిగి 72,850 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం (నవంబర్ 8, 2024) 910 రూపాయలు పెరగడంతో 79,470 రూపాయలు పలికింది. నవంబర్ 1వ తేదీతో.. అంటే ఈ నెలారంభంతో పోల్చితే నవంబర్ 8వ తేదీన బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి.

నవంబర్ 1న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 73,850 రూపాయలు ఉండగా.. ఇవాళ 72,850 రూపాయలు ఉంది. అంటే.. నవంబర్ 1తో పోల్చితే ఈ వారం రోజుల్లో బంగారం ధర 1000 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం కూడా అదే బాటలో ఉంది. నవంబర్ 1న 24 క్యారెట్ల బంగారం ధర 80,560 రూపాయలు పలికి మధ్యతరగతి జనానికి అందనంత దూరంలో కనిపించింది.

నవంబర్ 8న ఇదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 79,470 రూపాయల వద్ద నిలిచింది. ఈ వారం రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,090 రూపాయలు తగ్గిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదంతా హైదరాబాద్ మార్కెట్లో ఉన్న బంగారం ధరల గురించి అనాలసిస్.

ఓవరాల్గా చూసుకుంటే ఈ 8 ఎనిమిది రోజుల్లో బంగారం ధర 1.35 శాతం తగ్గింది. ఆగస్ట్ 2024 నుంచి బంగారం ధరలు అసలు నేలచూపులు చూసిందే లేదు. ఆగస్ట్లో 3.80 శాతం, సెప్టెంబర్లో ఏకంగా 5.75 శాతం, అక్టోబర్లో కూడా 5.74 శాతం బంగారం ధరలు పెరిగాయి. అక్టోబర్ లో అయితే ఒకానొక దశలో బంగారం ధర బులియన్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారి 81 వేల మార్క్ను రీచ్ అయింది.

ఇక వెండి ధరలు కూడా బంగారం ధరలను మించి పెరుగుతున్నాయి. నవంబర్ 8న కిలో వెండి ధర రూ.1,03,000 పలికింది. నవంబర్ 7న కిలో వెండి ధర రూ.1,02,000 ఉండగా, నవంబర్ 8కి వెయ్యి రూపాయలు పెరిగి రూ.1,03,000కు చేరింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వెండి ధరలు కూడా అమాంతం పెరిగాయి.

సెప్టెంబర్ 1న కిలో వెండి ధర రూ.92,000 ఉండగా, సెప్టెంబర్ 30న 1,01,000కి ఎగబాకింది. సెప్టెంబర్ నెలలో వెండి ధర 9.78 శాతం పెరిగింది. అక్టోబర్ లో కూడా వెండి ధర ‘తగ్గేదేలే’ అనే రీతిలో పెరుగుతూ పోయింది. అక్టోబర్ 1న 1,01,000 రూపాయలు ఉన్న కేజీ వెండి ధర అక్టోబర్ 31న 1,09,000కి చేరి మార్కెట్ నిపుణులనే విస్తుపోయేలా చేసింది. అక్టోబర్ నెలలో కూడా వెండి ధరలో 7.92 శాతం పెరుగుదల కనిపించింది.