
చెన్నై: ఐపీఎల్18వ సీజన్‌లో టాప్–4లో నిలిచేందుకు మిగతా జట్లు పోరాడుతుండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం తలపడనున్నాయి. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించిన ఇరు జట్లూ ఆరేసి ఓటములు ఎదుర్కొన్నాయి.
నాలుగు పాయింట్లతో పట్టికలో 9,10వ స్థానాల్లో నిలిచిన ఈ జట్లు ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇకపై ప్రతీ మ్యాచ్‌లోనూ నెగ్గాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగే పోరులో ఇరు జట్లూ పోటీ పడనున్నాయి. ఇందులో ఓడే జట్టు ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు ఆవిరి కానున్నాయి. దాంతో సన్ రైజర్స్, సీఎస్కే చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.
రైజర్స్ రాత మారేనా
భారీ స్కోరుతో ఈ సీజన్‌ను ధాటిగా ప్రారంభించిన సన్ రైజర్స్ తర్వాత అనూహ్యంగా తడబడింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, -అభిషేక్ శర్మ జోడీ గత సీజన్‌లో ఆకట్టుకున్నా ఈసారి ఎక్కువ ప్రభావం చూపలేకపోయారు. అభిషేక్ ఒకటి రెండు ఇన్నింగ్స్‌ల్లో మెరిసినా హెడ్ పూర్తిస్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఈ ఇద్దరిపై అతిగా ఆధారపడటం, ఇషాన్ కిషన్‌తో పాటు మిడిలార్డర్ బ్యాటర్లు తేలిపోవడంతో సన్ రైజర్స్ పూర్తిగా డీలా పడింది.
ముంబైతో గత పోరులో టాప్–4 బ్యాటర్లంతా కలిసి 13 రన్స్ కూడా చేయలేకపోవడంతో జట్టు ఘోరంగా ఓడిపోయింది. రైజర్స్ తిరిగి గాడిలో పడాలంటే బ్యాటర్లంతా సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. ఈసారి సన్ రైజర్స్ బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. కమిన్స్ నేతృత్వంలోని బౌలింగ్ కూడా మెరుగైతేనే సీఎస్కేపై విజయం ఆశించొచ్చు.