తల్లి ఫోన్‌లో గేమ్ ఆడుతూ లక్షన్నరకు ఫర్నీచర్ ఆర్డర్

రెండు మూడేళ్ల వయసులోనే పసి పిల్లలు స్మార్ట్ ఫోన్ ఓ రేంజ్‌లో వాడేస్తున్నారని మురిసిపోతుంటారు కొంత మంది. ఈ జనరేషన్ పిల్లలకు పెద్దల కంటే ఎక్కువగా ఫోన్‌లో అన్ని తెలుసని మరికొందరంటుంటారు. గేమ్స్ ఆడడం, వీడియో చూడడం, ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టడం ఇలా అన్నీ చాలా చిన్న వయసులోనే వచ్చాస్తున్నాయని సంబరపడిపోవడం చాలా మంది చూసే ఉంటారు. అయితే ఈ సంబరంలో కొంచెం చిన్న జాగ్రత్త అవసరం. ఏమైనా చేస్తున్నారు, అన్నీ తెలుసు కదా అని ఫోన్ ఇచ్చేస్తుంటే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పిల్లలు తెలియకుండా ఆన్‌లైన్‌లో హ్యాకర్లకు దొరికి డబ్బులు పోగొట్టవచ్చని, లేదా ఏదైనా అవసరం లేనివి ఆర్డర్లు పెట్టేసి ఇంటి మీదకు తెచ్చే పరిస్థితి రావొచ్చని చెబుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికాలో ఉంటున్న ఓ ఎన్నారైకి ఎదురైంది.

అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్న ప్రమోద్ కుమార్, మధు అనే దంపతులకు అయాన్ష్ కుమార్ అనే రెండేళ్ల కొడుకు ఉన్నాడు. ఆ పసివాడు ఇటీవల తల్లి ఫోన్ తీసుకుని గేమ్ ఆడుతున్నాడు. రోజు మాదిరిగానే ఆడుకుంటున్నాడు కదా అని తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అయాన్ష్ గేమ్ ఆడుతూ ఆడుతూనే తెలియకుండా వాల్‌మార్ట్‌ నుంచి దాదాపు లక్షన్నర రూపాయల ఖరీదైన ఫర్నీచర్ ఆర్డర్ చేస్తాడని ఊహించలేదు. ఆ ఫర్నీచర్ ఇంటికి డెలివరీ అయినప్పటికీ గానీ తెలుసుకోలేకపోయారు. డెలివరీ వచ్చాక షాకవడం ఆ తల్లిదండ్రుల వంతైంది. తమ కొడుకు ఈ ఆర్డర్ పెట్టాడంటే నమ్మశక్యం కాలేదని, కానీ అదే నిజమని తెలిసి అవాక్కయ్యామని తండ్రి ప్రమోద్ కుమార్ చెప్పాడు. అయితే ఆ ఫర్నీచర్ కొనాలని గతంలో అనుకుని కార్ట్‌లో యాడ్ చేసి ఉంచానని, కానీ ఆర్డర్ తర్వాత పెట్టొచ్చులే అనుకున్నానని తల్లి మధు చెప్పింది. కానీ ఊహించని రీతిలో డెలివరీ వస్తుండడం చూసి షాకయ్యానని, దాదాపు వారం రోజుల పాటు ఒక్కొక్కటిగా డెలివరీ వస్తూనే ఉన్నాయని ఆమె తెలిపింది. ఇల్లు మారే ప్లాన్‌లో ఉన్నామని, మారిన తర్వాత కావాల్సిన వస్తువులను కార్ట్‌లో యాడ్ చేస్తే అయాన్ష్ అప్పుడే ఆర్డర్ చేసేశాడని, తమ రెండేళ్ల కొడుకు ఇవన్నీ ఆర్డర్ చేయడం చూసి నవ్వుకున్నామని మధు చెప్పింది. అయితే జరిగిన విషయాన్ని వాల్‌మార్ట్ కస్టమర్ కేర్‌‌కు రిపోర్ట్ చేస్తే వాళ్లు వాటిని రిటర్న్ తీసుకుని ఫుల్ రీఫండ్ చేసేందుకు ఒప్పుకున్నారని ఆమె వివరించింది.

మరిన్ని వార్తల కోసం..

ఒక్క చాన్స్ ఇవ్వండి: కేజ్రీ

జపాన్‌ మాజీ ప్రధానికి నేతాజీ అవార్డు

 

క్షిపణి దాడిని తిప్పికొట్టిన అబుదాబి