జనగామ జిల్లాలో ఖర్జూర కల్లు కోసం క్యూ

తాటిచెట్లు, ఈతచెట్లు కొన్నినెలలు మాత్రమే కల్లు ఇస్తాయి. కానీ, ఖర్జూర చెట్ల నుంచి ఏడాదంతా కల్లు వస్తుంది. ప్రభుత్వం రోడ్ల వెంట ఖర్జూర చెట్లు పెంచితే తమకు ఉపాధితో పాటు ప్రజలకు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని గీత కార్మికులు అంటున్నారు

ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే తాటికల్లు, ఈతకల్లు అందరికీ తెలుసు. ఇదే తరహాలో ఇప్పుడు జనగామ జిల్లాల్లో ఖర్జూర కల్లు జనాన్ని అట్రాక్ట్ చేస్తోంది. కొబ్బరి నీళ్ల కంటే తియ్యగా ఉండే ఖర్జూర కల్లు తాగేందుకు జనం క్యూ కడుతున్నారు. 

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ గ్రామంలో దొరుకుతున్న ఖర్జూర కల్లు కోసం జనం క్యూ కడుతున్నారు.చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లే కాదు.. సుదూరంలో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ తదితర జిల్లాల నుంచి కూడా ఖర్జూర కల్లు కోసం వస్తున్నారు. రెండు నెలలుగా ఖర్జూర కల్లును రుచి చూస్తున్న రాఘవాపూర్ గ్రామస్తుల మౌత్ పబ్లిసిటీతో.. భలే గిరాకీ ఏర్పడింది. చివరికి స్థానికులకే దొరకని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎంతైనా ఇచ్చి తాగి వెళుతుండడంతో ఖర్జూర కల్లు తమకు దొరకడం లేదని స్థానికులు చెబుతున్నారు. 

గ్రామంలోని కొందరు రైతులు మూడేళ్ల కిందట తమ భూమి చుట్టూ ఖర్జూర చెట్లు నాటారు. అందులో కొన్నిఎండిపోగా ఆరు మొక్కలే మిగిలాయి. అవి చెట్లుగా ఎదగడంతో గీతకార్మికులు కల్లు తీస్తున్నారు. ప్రస్తుతం నాలుగు చెట్లలో  రోజుకు రెండింటి నుంచే కల్లు తీస్తున్నారు. ఒక్క చెట్టుకు 20 నుంచి 30 లీటర్ల వరకు కల్లు పారుతోందని గీత కార్మికులు చెబుతున్నారు.

లీటర్  ఖర్జూర కల్లు  వంద రూపాయలకు అమ్ముతున్నారు. ఈ కల్లు  కొబ్బరి నీళ్ల కంటే తియ్యగా ఉన్నాయని తాగిన జనం చెబుతున్నారు. ఖర్జూర కల్లు తాగితే వాసన కూడా రావడం లేదంటున్నారు. ఈ కల్లుతో ఆరోగ్యానికి చాలా మంచిదని...కిడ్నీలో రాళ్లు కరగడంతో పాటు ఇతర జబ్బులు నయమవుతాయని చెబుతున్నారు. తాటిచెట్లు, ఈతచెట్లు కొన్నినెలలు మాత్రమే కల్లు ఇస్తాయి. కానీ, ఖర్జూర చెట్ల నుంచి ఏడాదంతా కల్లు వస్తుందని గీత కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వం రోడ్ల వెంట ఖర్జూర చెట్లు పెంచితే తమకు ఉపాధితో పాటు ప్రజలకు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అంటున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఖర్జూర కల్లును ప్రభుత్వం ప్రోత్సహించాలని గీతాకార్మికులు కోరుతున్నారు.