![కల్లులో పురుగుల మందు కలిపిన గీత కార్మికుడు.. చివరికి ఏమైందంటే](https://static.v6velugu.com/uploads/2025/02/toddy-worker-mixed-pesticide-in-toddy_Asyg2khvfM.jpg)
- తనకన్నా ఎక్కువ కల్లు పారుతుందని కక్ష
- తోటి గీత కార్మికుడిపై కోపంతో దుశ్చర్య
- ఖమ్మం జిల్లా జీళ్లచెర్వులో ఘటన
కూసుమంచి, వెలుగు: తన కన్నా కల్లు ఎక్కువ గీస్తున్నాడన్న కక్షతో ఓ గౌడ్ కల్లు కుండలో మరో గీత కార్మికుడు పురుగుల మందు కలిపాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలానికి చెందిన గౌడ కులస్తులు జీళ్లచెరువు దగ్గర తాళ్లల్లో చాలా ఏండ్లుగా కల్లుగీస్తున్నారు. అదే గ్రామానికి రమేశ్ గౌడ్, సూర్యాపేట జిల్లా మోతే మండలం ఉర్లుగొండ నుంచి వచ్చిన వీరబాబు ఇక్కడ కల్లు గీస్తున్నారు. వీరబాబు గీసే చెట్ల నుంచి ఎక్కువగా కల్లు పారుతుందని రమేశ్ అక్కస్సు పెంచుకున్నాడు.
రమేశ్ దగ్గర డైలీ కల్లుతాగే ఇద్దరు వ్యక్తులు ఇటీవల వీరబాబు దగ్గరకు కల్లు తాగేందుకువెళ్లారు. అప్పటికే వీరబాబు మీద కోపంతో ఉన్న రమేశ్ అతనితో గొడవ పెట్టుకున్నాడు. వీరబాబును దెబ్బతీయాలన్న ఆలోచనతో ఈ నెల 6న ఎవ్వరు లేని సమయంలో వీరబాబు గీసే తాటి చెట్టు ఎక్కి గొలకు కట్టిన ఓ లొట్టిలో పురుగుమందు కలిపాడు. మర్నాడు వీరబాబు లొట్టిలో కల్లు ఒడిసి కిందకు తెచ్చాడు. కల్లు డిఫరెంట్వాసన రావడంతో.. దాన్ని పరిశీలిస్తే పురుగులమందు కలిపినట్టు తెలిసింది.
వెంటనే లొట్టిని తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు రమేశ్ మీద అనుమానం ఉన్నట్టు వీరబాబు కంప్లైంట్ చేశాడు. కూసుమంచి పోలీసులు రమేశ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే పురుగుల మందు కలిపినట్టు ఒపుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసి, మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.