మర్రిపల్లి కేజీబీవీలో మరుగుదొడ్ల సమస్య..మనిషికిన్ని పైసలేసుకున్న పేరెంట్స్!

  •   మర్రిపల్లి కేజీబీవీలో మరుగుదొడ్ల సమస్య..మనిషికిన్ని పైసలేసుకున్న పేరెంట్స్!
  •     ఆరు నెలల నుంచి అమ్మాయిల ఇబ్బందులు
  •     నిధులున్నా రిపేర్లు చేయించలే.. 
  •     కొత్తవి కట్టించాలని తల్లిదండ్రుల నిర్ణయం
  •     తమకు సంబంధం లేదన్న స్పెషలాఫీసర్​

వేములవాడ రూరల్, వెలుగు :  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్​మండలం మర్రిపల్లి కేజీబీవీలో టాయిలెట్స్, మరుగుదొడ్ల సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండడంతో పరిష్కారానికి తల్లిదండ్రులే ముందుకు కదిలారు. ఆరు నెలల నుంచి వారి పిల్లలు సతమతం అవుతుండడంతో అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి కొత్తవి కట్టించాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడి కేజీబీవీని సుమారు పదేండ్ల కింద ప్రారంభించగా ప్రస్తుతం300 మంది అమ్మాయిలు చదువుతున్నారు. స్కూల్​లో 30 నుంచి 35 వరకు టాయిలెట్స్, మరుగుదొడ్లు ఉండగా, ఆరు నెలల నుంచి పైపులు డ్యామేజై నీళ్లు బయటకు పోవడం లేదు. దీంతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. 

టాయిలెట్స్​కు రిపేర్లు చేయించేందుకు నిధులున్నా టైం పట్టే అవకాశం ఉండడంతో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులంతా సమావేశమయ్యారు. సుమారు 300 మంది కలిసి ఓ కమిటీగా ఏర్పడ్డారు. మనిషికి రూ. 500, రూ. వెయ్యి చొప్పున..ఎవరికి తోచినంత వారు వేసుకుని కొత్త టాయిలెట్లు, మరుగుదొడ్లు కట్టించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై కేజీబీవీ స్పెషల్​ఆఫీసర్​శకుంతలను వివరణ కోరగా..పేరెంట్స్​కమిటీ వేసుకుని టాయిలెట్స్‌ నిర్మాణానికి ముందుకు వచ్చారని, దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పాత టాయిలెట్స్​కు రిపేర్లు చేసుకునేందుకు తమ దగ్గర నిధులు ఉన్నాయని, కొన్ని సమస్యలు ఉండడంతో ఆలస్యమవుతోందన్నారు.