అడవిలో డబ్బుల డంప్‌‌‌‌ దొరికిందని టోకరా.. వరంగల్లో ఎనిమిది మంది అరెస్ట్‌‌‌‌

అడవిలో డబ్బుల డంప్‌‌‌‌ దొరికిందని టోకరా.. వరంగల్లో  ఎనిమిది మంది అరెస్ట్‌‌‌‌
  • రూ. లక్షకు 2 లక్షల అసలు నోట్లు, 4 లక్షల నకిలీ నోట్లు ఇస్తానని బేరం   
  •     ఒక్కడినే తీసుకుంటే మంచిది కాదని, అందుకే పంచుతున్నట్లు ప్రచారం
  •     రూ. లక్షకు 2 లక్షల అసలు నోట్లు, నాలుగు లక్షల నకిలీ నోట్లు ఇస్తానని బేరం
  •     ఎనిమిది మంది అరెస్ట్‌‌‌‌, 
  • రూ. 34.84 లక్షల ఒరిజినల్‍, రూ.21 లక్షల ఫేక్‌‌‌‌ నోట్లు స్వాధీనం

వరంగల్‍, వెలుగు : ‘నాకు అడవిలో డబ్బుల డంప్‌‌‌‌ దొరికింది.. ఇందులో అసలు, నకిలీ నోట్లు ఉన్నాయి.. ఆ డబ్బంతా నేనొక్కడినే తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.. అందుకే రూ. లక్ష ఇచ్చిన వారికి రూ. 2 లక్షల ఒరిజినల్‌‌‌‌ నోట్లు ఇస్తా, నకిలీవి కావాలంటే నాలుగు లక్షలు ఇస్తా’ అంటూ మోసం చేస్తున్న వ్యక్తితో పాటు మరో ఏడుగురిని వరంగల్‌‌‌‌ కేయూసీ పోలీసులు శనివారం అరెస్ట్‌‌‌‌ చేశారు. 

కేసుకు సంబంధించిన వివరాలను సీపీ అంబర్‌‌‌‌ కిశోర్‌‌‌‌ ఝా శనివారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌‌‌‌ మండలం మోరంపల్లి బంజరకు చెందిన మణికాల కృష్ణ గొర్రెల వ్యాపారం చేసేవాడు. ఈజీ మనీ కోసం నకిలీ నోట్లు చలామణి చేయాలని ప్లాన్‌‌‌‌ చేశాడు. ఇందులో భాగంగా తనకు డబ్బులు దొరికాయని, అదంతా తానొక్కడినే తీసుకోకుండా పలువురికి పంచుతానని చెప్పాడు. 

పలువురు వ్యక్తులను డబ్బుల డంప్‌‌‌‌ వద్దకు తీసుకెళ్లి నోట్లు చూపించేవాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల శ్రీనివాస్‌‌‌‌కు సైతం డబ్బులు చూపడంతో అతడు నిజమేనని నమ్మాడు. దీంతో రూ.10 లక్షల ఒరిజినల్‌‌‌‌ నోట్లకు రూ.20 లక్షల అసలు నోట్లు, మరో రూ.5 లక్షల ఒరిజినల్‌‌‌‌ నోట్లకు రూ. రూ.20 లక్షల నకిలీ నోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. 

తర్వాత కృష్ణ మరో నలుగురితో కలిసి శుక్రవారం కారులో హనుమకొండ ఔటర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డులోని పెగడపల్లి క్రాస్‌‌‌‌ వద్దకు వచ్చాడు. మరో వైపు శ్రీనివాస్‌‌‌‌ కూడా మరో ఇద్దరితో కలిసి అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో పెట్రోలింగ్‍ చేస్తున్న పోలీసులు వీరిని చూసి అనుమానంతో అదుపులోకి తీసుకొని, కారును తనిఖీ చేయగా రూ.34.84 లక్షల ఒరిజినల్‌‌‌‌, రూ.21 లక్షల ఫేక్‌‌‌‌ నోట్లు, వాటి తయారీకి వాడే తెల్ల కాగితాలు బయటపడ్డాయి. 

దీంతో కృష్ణ, శ్రీనివాస్‌‌‌‌తో పాటు కర్నూల్‌‌‌‌ జిల్లా వేత్పనూరుకు చెందిన బిజిని వేముల వెంకటయ్య, భద్రాద్రి కొత్తగూడెం నక్రిపేటకు చెందిన ధరంసోత్‌‌‌‌ శ్రీను, తేజావత్‌‌‌‌ శివ, ముమామిడికి చెందిన గుగులోతు వీరన్న, హనుమకొండ జిల్లా కేశవాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన ఉడుత మల్లేశ్‌‌‌‌, ఎర్రగొల్ల అజయ్‍ని అరెస్ట్‌‌‌‌ చేశారు. కరెన్సీతో పాటు ఆటో, తొమ్మిది సెల్‍ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన హనుమకొండ ఏసీపీ దేవేందర్‍రెడ్డి, కేయూసీ సీఐ రవికుమార్‍, ఎస్సై మాధవ్‍, హెడ్‌‌‌‌కానిస్టేబుల్‌‌‌‌ నర్సింగ్‌‌‌‌రావు, కానిస్టేబుళ్లు శ్యాంరాజు, సంజీవ్‍, సంపత్‍తో పాటు హోంగార్డు రాజేందర్‍ను సీపీ అభినందించారు.