పిల్లను వెతికి పెడతాం.. పెళ్లి చేసుకోండి : డేటింగ్ యాప్ తీసుకొచ్చిన జపాన్ ప్రభుత్వం

ప్రపంచ వ్యాప్తంగా డేటింగ్ యాప్స్ పై నిఘా.. ఆంక్షలు.. నిషేధం విధిస్తున్న సమయంలో ఓ ప్రభుత్వమే ఏకంగా డేటింగ్ యాప్ తీసుకొచ్చింది. సింగిల్స్ కోసం జపాన్ దేశం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నది. జపాన్ దేశంలో కుర్రోళ్లు ఎవరూ పెళ్లి చేసుకోవటం లేదు.. పిల్లల్ని కనటం లేదు. దీంతో వృద్ధులు పెరిగి.. యువత తగ్గి భవిష్యత్ లో దేశం సంక్షోభంలోకి వెళ్లనుంది. ఈ క్రమంలోనే జపాన్ సర్కార్.. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే డేటింగ్ యాప్ తీసుకొచ్చింది. సింగిల్స్ మీ కోసమే.. మేం పిల్లను వెతికి పెడతాం.. మీరు పెళ్లి చేసుకోండి.. మీకు కావాల్సిన పిల్ల లేదా పిల్లోడును ప్రభుత్వం ఆధ్వర్యంలోనే డేటింగ్ యాప్ లో పట్టుకోండి అంటూ ప్రచారం చేస్తుంది..

స్వయంగా ప్రభుత్వమే డేటింగ్ యాప్ ను లాంచ్ చేసి ప్రమోట్ చేయటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టోక్యో ఫుటారి స్టోరి పేరుతో డేటింగ్ యాప్ ను లాంచ్ చేసింది జపాన్ ప్రభుత్వం. అయితే, ఈ యాప్ కేవలం పెళ్లికి సిద్దమైన వారిని మాత్రమే అనుమతిస్తుందని తెలుస్తోంది.50ఏళ్ళ వయసున్న పురుషుల్లో సుమారు 30శాతం మంది బ్రహ్మచారులుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. తగ్గుతున్న బర్త్ రేట్ ను పెంచటం కోసమే ప్రభుత్వం ఈ యాప్ ను లాంచ్ చేసిందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వచ్చే 6ఏళ్లలో యువత జనాభా భారీగా పడిపోతుందని, యువత జనాభాను కాపాడుకోవటానికి ఇదే చివరి అవకాశంగా భావిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం అభిప్రాయ పడింది. ఈ యాప్ ను ప్రమోట్ చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే 300 యెన్ ల ( 16కోట్ల రూపాయలు )నిధులు కేటాయించినట్లు తెలిపింది.