
టోక్యో: పారాలింపిక్స్ లో భారత్‌కు మరో గోల్డ్ దక్కింది. F64 కేటగిరీ మెన్స్ జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్ గోల్డ్ మెడల్ సాధించాడు. గోల్డ్‌తో పాటు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 68.55 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్ లోనే మూడు వరల్డ్ రికార్డ్ లు సాధించాడు సుమిత్. మొదట 66.95 మీటర్ల దూరం విసిరి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. F64 కేటగిరీ మెన్స్ జావెలిన్ త్రో ఫైనల్‌లో మొత్తం ఐదు రౌండ్లలో మూడు సార్లు అందరి కంటే ఎక్కువ దూరం విసిరి ఒకే గేమ్ లో మూడు సార్లు వరల్డ్ రికార్డ్ సాధించిన ఘనత సుమిత్‌కు దక్కింది.
ఒక్క రోజులో ఐదు మెడల్స్
సుమిత్ సాధించిన ఈ మెడల్‌తో భారత్ ఒకే రోజులో పారాలింపిక్స్‌లో ఐదు మెడల్స్ సొంతం చేసుకున్నట్టయింది. ఇవాళ (సోమవారం) ఉదయం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో... అవనీ లేఖరా గోల్డ్ మెడల్ గెలించింది. డిస్కస్ త్రోలో యోగేశ్ కథూనియా... క్లాస్ F56 విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. జావెలిన్ త్రో క్లాస్ F-46 విభాగంలో రెండు పథకాలను భారత క్రీడాకారులే గెలుచుకున్నారు. దేవేంద్ర ఝఝారియా సిల్వర్, సుందర్ సింగ్ బ్రాంజ్ మెడల్ సాధించారు. పారాలింపిక్స్ చరిత్రలో రికార్డు స్థాయిలో మెడల్స్ సాధించడమే కాకుండా ఒకే రోజు రెండు గోల్డ్ మెడల్స్ గెలవడం మరో రికార్డ్.
బైక్ యాక్సిడెంట్‌లో కాలు పోయింది
23 ఏండ్ల సుమిత్ హర్యానాలోని సోన్‌పేట్‌కు చెందిన వ్యక్తి. 2015లో జరిగిన ఓ బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రగాయాలయ్యాయి. ఆ సమయంలో సుమిత్‌కు ఎడమ కాలులో మోకాలు కింది భాగం పూర్తిగా కోల్పోయాడు. ఈ ప్రమాదం తర్వాత కొన్నాళ్లకు కోలుకున్న సుమిత్ పారాలింపిక్స్‌లో తనకు అర్హత ఉందని తెలుసుకుని స్పోర్ట్స్‌పై దృష్టి పెట్టాడు. తీవ్రంగా శ్రమించి శిక్షణ పొంది.. నేడు వరల్డ్ రికార్డులు సెట్ చేశాడు.