ఖమ్మం సూర్యాపేట హైవేపై టోల్ చార్జీల మోత షురూ

ఖమ్మం, వెలుగు: ఖమ్మం–సూర్యాపేట హైవేపై శుక్రవారం నుంచి టోల్  వసూళ్లు ప్రారంభమయ్యాయి. పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ కాకుండానే మోతె మండలం మామిళ్లగూడెం దగ్గర సిబ్బందిని నియమించి టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. తల్లంపాడు, అగ్రహారం సమీపంలో రెండు చోట్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం పూర్తయినా, వాటిని లింక్​ చేసే రహదారిపై ఇంకా గ్రావెల్ ఫిల్లింగ్ చేయలేదు. దీంతో ఈ రెండు చోట్ల ప్రస్తుతం వాహనదారులు సర్వీస్​ రోడ్డునే ఉపయోగించాల్సి వస్తోంది. మరోవైపు ఖమ్మం, సూర్యాపేట మధ్య కొత్తగా నిర్మించిన గ్రీన్​ ఫీల్డ్ హైవేను ఉపయోగించకుండానే పాత రోడ్డుపై తల్లంపాడు, జీళ్లచెర్వు, పాలేరు మీదుగా నాయకన్​ గూడెం వరకు వెళ్లిన వాహనాలు కూడా కిలోమీటర్  దూరం కూడా జర్నీ చేయకుండానే టోల్ ఫీజు కట్టాల్సి వస్తోంది. 

ప్రమాదాలకు ఎవరిదీ బాధ్యత?

ఇండియన్​ రోడ్​ కాంగ్రెస్​ మాన్యూవల్ ప్రకారం రెండు హైవేలు కలిసే చోట గ్రేడ్  సెపరేటెడ్  జంక్షన్​ నిర్మించాల్సి ఉన్నా ఆఫీసర్లు లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇక మెటాలిక్ క్రాష్ బ్యారియర్​లు, రెయిలింగ్  ఇతర సేఫ్టీ నిర్మాణాలకు సంబంధించిన వివరాలు కాంట్రాక్టర్​కు ఇచ్చిన అగ్రిమెంట్ లో ఉన్నాయా? ఉంటే అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు కట్టలేదు. అగ్రిమెంట్ లో లేకపోతే కాంట్రాక్టర్​ ఎందుకు చెప్పలేదు? కాంట్రాక్టర్​ చెబితే నేషనల్​ హైవే ఆఫీసర్లు ఎందుకు స్పందించలేదు? రెండు నేషనల్​ హైవేలు కలిసినప్పుడు అమలు చేయాల్సిన విధానం ఏంటి? దాన్ని ఎందుకు అమలు చేయలేదు? దానికి బాధ్యత ఎవరిది? గ్రేడ్​ సెపరేటర్​పై అసలు విషయం చెప్పకుండా దాటవేత ధోరణి ఎందుకనే విషయాలపై ఉన్నతాధికారులు ఫీల్డ్ ఎంక్వైరీ చేసి, తప్పు చేసిన వారిని బాధ్యులుగా చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైవే నిర్మాణాల్లో ఇంజినీరింగ్ లోపాలకు ఆయా ఆఫీసర్లనే బాధ్యులుగా చేస్తామని పేర్కొంటూ ఇటీవల నేషనల్​ హైవే ఆఫ్​ ఇండియా అథారిటీ ఆదేశాలు ఇచ్చింది. గ్రేడ్​ సెపరేటర్​ నిర్మాణంలో నిర్లక్ష్యంతో పాటు ఇతర సేఫ్టీ ఫీచర్ల విషయంలోనూ ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ఈ సర్క్యులర్​ను అమలు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఆఫీసర్లు మాత్రం రూల్స్  ప్రకారమే నడుచుకుంటున్నామని చెబుతున్నారు.