- ఏ సమస్య ఉన్నా18005994007కు కాల్ చేయొచ్చు
- గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ
- తొలిరోజు తొమ్మిది కంప్లయింట్స్
- ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా సమస్యకు పరిష్కారం
హైదరాబాద్, వెలుగు: మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు మంత్రి సీతక్క ఆదేశాలతో అధికారులు టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్‌లో సోమవారం కాల్ సెంటర్ ప్రారంభం కాగా, తొలి రోజు వివిధ జిల్లాల నుంచి 9 ఫిర్యాదులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో భగీరథ నీటి సరఫరాలో తలెత్తే ఇబ్బందులపై మిషన్ భగీరథ టోల్ ఫ్రీ నంబర్ 1800-599-4007 కు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ కాల్ సెంటర్ 24 గంటలు పనిచేయనున్నది.
రాత్రి, పగలు పనిచేసేలా సూపరిటెండెంట్, ఇంజినీర్ నేతృతంలో ఐదుగురు సిబ్బందితో కాల్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. సిబ్బంది పగలు వచ్చే కాల్స్ ను అటెండ్ చేసి, వివరాలు నమోదు చేసుకుంటారు. రాత్రి వచ్చే కాల్స్ రికార్డు అవుతాయి. మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి ప్రతి రోజూ వచ్చే ఫిర్యాదులను సమీక్షిస్తారు. ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లో సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ టోల్ ఫ్రీ ద్వారా వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలోని భగీరథ అధికారులు, సిబ్బందికి తెలియజేసి.. పరిష్కారానికి సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.
కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్
రూ.వేల కోట్లు ఖర్చుచేసి మిషన్ భగీరథ వ్యవస్థను ఏర్పాటు చేసినా.. ప్రజలు ఇంకా ఆర్వో ప్లాంట్లు, బోరు నీళ్లపై ఆధారపడుతున్నారు. ఆర్వో ప్లాంట్లు, బోర్ వాటర్‌తో తలెత్తే సమస్యలపై ప్రజలకు వివరించాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. ప్రజలు మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటిని వినియోగించేలా స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలని ఆదేశించారు. నీటి నాణ్యతను ప్రజలకు వివరించేలా గ్రామస్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు సదస్సులు నిర్వహించాలని సూచించారు. దీంతో అధికారులు నిరంతరం సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
భగీరథలో సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. భగీరథ నీటిపై ప్రజలకు విశ్వాసం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. నీటి సరఫరాలో లీకేజీలు అరికట్టడంతోపాటు తాగునీటి సరఫరా సజావుగా సాగేలా గ్రామాల్లో మంచి నీటి సహాయకులను నియమించారు. వీరు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించనున్నారు. ఈ మేరకు వీరికి మండల కేంద్రాల్లో వారంపాటు శిక్షణ ఇచ్చారు. ఒక వేళ మేజర్ రిపేర్లు అయితే, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేసేలా ఆల్టర్నేట్ చర్యలు చేపడుతారు.