హైదరాబాద్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్..

హైదరాబాద్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్..

హైదరాబాద్: సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం మైహోం భుజా అపార్ట్మెంట్లో ఉంటున్న పోసాని కృష్ణ మురళి ఇంటికి వెళ్లి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో నమోదయ్యిన కేసుల్లో పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ నెంబర్ 65/25 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఏపీ నుంచి హైదరాబాద్ లోని పోసాని ఇంటికి ఒక ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుల్స్ టీం వచ్చి పోసానిని అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

వైసీపీ హయాంలో ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసానికి అవకాశం దక్కింది. జగన్ పై విమర్శలు చేస్తే ఎవరిపై అయినా పోసాని ఒంటి కాలిపై లేచేవారు. గతంలో ఏపీలో వైసీపీకి పూర్తి స్థాయి మద్దతు ప్రకటించిన పోసాని ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీకే కాదు రాజకీయాలకే గుడ్ బై చెప్పి ఫుల్ టైం సినిమాల్లో బిజీగా ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజకీయాలకు దూరంగా ఉంటానని పోసాని ప్రకటించారు. అయినప్పటికీ టీడీపీని, చంద్రబాబును, పవన్ను గతంలో తీవ్రంగా విమర్శించిన కారణంగా పోసానిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారని వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

వల్లభనేని వంశీ మోహన్ను గురువారం(ఫిబ్రవరి 13) ఉదయం హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. 2024 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పుబెట్టారు.

గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 143, 147, 148, 435, 506 రెడ్విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) కింద కేసు నమోదు చేశారు. కార్యాలయ ఫర్నిచర్ను ధ్వంసం చేసి అక్కడే ఉన్న కొందరు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగులబెట్టినట్టుగా వంశీ అనుచరులపై కేసు నమోదైంది. వంశీ అనుచరులు గానీ, వైసీపీ కార్యకర్తలు గానీ.. మొత్తం మీద 71 మంది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు, వీడియోల ద్వారా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక వంశీ పాత్ర ఉందని ఆయనను నిందితుడిగా చేర్చారు.