తెలుగుతో పాటు తమిళంలోనూ హీరోయిన్‌గా చక్కని గుర్తింపును అందుకుంది రీతూ వర్మ. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్‌లో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ‘శ్రీకారం’ లాంటి సందేశాత్మక చిత్రంతో ఆకట్టుకున్న కిషోర్ బి.. ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నారు. మిస్టిక్ ఎలిమెంట్స్‌తో సాగే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇదని తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే డెబ్భై శాతం వరకూ చిత్రీకరణ పూర్తయినట్టు సమాచారం.
ఈ నెలాఖరులో కొత్త షెడ్యూల్ మొదలవబోతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‍స్టార్‌లో ఇది స్ట్రీమింగ్‍కు రానుంది. ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ అనే ఆంథాలజీ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన రీతూ వర్మకు ఇదో రెండో వెబ్ సిరీస్. యువ హీరోలు శివ కందుకూరి, ‘బుట్టబొమ్మ’ ఫేమ్ సూర్యలతో పాటు సుబ్బరాజు, అభినయశ్రీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రాఫర్. ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ జే క్రిష్ సంగీతం అందిస్తున్నాడు.