అష్టదిగ్బంధంలో సినీ ఇండస్ట్రీ: బెట్టింగ్ మాఫియాలో 25 మంది హీరో, హీరోయిన్స్

అష్టదిగ్బంధంలో సినీ ఇండస్ట్రీ: బెట్టింగ్ మాఫియాలో 25 మంది హీరో, హీరోయిన్స్

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్​వల్ల అప్పుల పాలై రాష్ట్రంలో ఒక్క 2024 సంవత్సరంలోనే వెయ్యి మంది ఆత్మహత్య చేసుకున్నారు. అయినప్పటికీ ఈ సో కాల్డ్ సినిమా సెలబ్రెటీలకు, ఇన్ స్టాగ్రాం ఇన్ ఫ్లూయెన్సర్లకు చీమ కుట్టినట్టు కూడా లేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఆ సెలబ్రెటీ స్థాయిని బట్టి కోట్లలో, లక్షల్లో, వేలల్లో డబ్బులు అందుతుండటంతో ఎవడెలా పోతే మాకేంటనే ధోరణిలో బెట్టింగ్ యాప్స్ను సెలబ్రెటీలు ప్రమోట్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్పై నిషేధం ఉన్నప్పటికీ సెలబ్రెటీలు కాసుల కక్కుర్తితో ఇలా బరితెగించడంతో ఖాకీలు కన్నెర్ర చేశారు. ఇక.. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన వాళ్ల భరతం పట్టాలని డిసైడ్ అయిన పోలీసులు పాతిక (25) మంది సెలబ్రెటీలపై కేసులు నమోదు చేశారు.

బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాక్ట్ల కింద సినీ నటులు 1. రాణా దగ్గుపాటి, 2. ప్రకాశ్ రాజ్, 3. విజయ్ దేవరకొండ, 4. మంచు లక్ష్మి, 5. ప్రణీత, 6. నిధి అగర్వాల్, 7. అనన్య నాగళ్లపై కేసులు నమోదు చేశారు. 318(4), 112 రెడ్‌విత్‌, బీఎన్‌ఎస్‌ 3, 3(A), ఐటీ యాక్ట్‌ 66D సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడుగురితో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మరో 18 మంది సీరియల్ నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. 

Also Read:-పంజాగుట్ట పీఎస్కు యాంకర్ విష్ణుప్రియ..

ఎవరెవరు ఏఏ బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్స్ను ప్రమోట్ చేశారో ఆధారాలతో సహా పోలీసులు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. ఈ లిస్ట్లో ఉన్న 25 మందికి విచారణకు హాజరు కావాలని త్వరలో నోటీసులు పంపనున్నారు. అప్పట్లో డ్రగ్స్ కేసులో చిక్కుకుని అభాసుపాలైన టాలీవుడ్ మరోసారి ఈ బెట్టింగ్ యాప్స్ ఊబిలో చిక్కుకుని విమర్శల పాలైంది.

బెట్టింగ్ యాప్స్​దందాను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. బెట్టింగ్ , గేమింగ్స్ యాప్స్ పేరుతో ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ యాప్స్​ను  ప్రమోట్​ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయించి, ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్ నిర్వహణపై మానిటరింగ్ చేయాలని పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం.

ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ను గుర్తించి, వాటిని టెక్నాలజీ సాయంతో అడ్డుకట్ట వేయాలని, యాప్స్కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ చర్యలతో దిగివస్తున్న కొందరు సోషల్​ మీడియా ఇన్​ప్ల్యుయెన్సర్స్​.. క్షమాపణలు చెప్తూ  వీడియోలు చేస్తుంటే,  మరికొందరు మాత్రం గతంలో తాము చేసిన బెట్టింగ్​యాప్స్​ వీడియోలను, అకౌంట్స్ను  తొలగిస్తున్నారు.