చిరునవ్వుని తీసుకొచ్చే సునిశిత హాస్యం, కడుపుబ్బ నవ్వించే హాస్యం అరుదుగా అనుభవంలోకి వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మనోహర హాస్యాన్ని కోరుకునేవారి కోసం, నవ్వుల నజరానాను అందరికీ అందించడం కోసం సినీ వినీలాకాశంలో వేణుమాధవ్ అనే ఓ ధ్రువతార తళుక్కుమంది. తన హావభావాలతో, శరీర కదలికలతో, అమాయకపు మొహంతో, తన చిత్ర విచిత్ర చేష్టలతో రసజ్ఞులైన ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించగల హాస్యనటుడిగా వేణుమాధవ్ మారాడు. తెలంగాణ సాంస్కృతిక నవ్వుల పూదోటలో హాస్యం అనే పుష్పాలను విరబూయిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ కోట్లాది హృదయాలను తన హాస్యపు జల్లుల ద్వారా తడిసి ముద్ద అయ్యేలా చేశాడు.
జీవన ప్రస్థానం..
వేణుమాధవ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కోదాడ పట్టణంలో 1969 సెప్టెంబర్ 28న జన్మించాడు. తండ్రి ప్రభాకర్, తల్లి సావిత్రి. తండ్రి టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. తల్లి గ్రామీణ వైద్యురాలు. కోదాడ పట్టణంలో కేఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో చదివిన వేణు హడావుడి అంతా ఇంతా ఉండేది కాదు. పాటలు పాడడం, మిమిక్రీ చేయడం, డాన్స్ చేయడం, అంటే వేణుమాధవ్‌కి ఇష్టం. వేణుకి మంచి లయ జ్ఞానం ఉంది. సాంస్కృతిక పోటీలలో బహుమతులు చాలా గెలుచుకునేవాడు.
తొలిప్రేమ సినిమాతో గుర్తింపు
ఒకరోజు ఆకృతి సంస్థ రచయిత దివాకర్ బాబుకు సన్మాన కార్యక్రమం రవీంద్రభారతిలో జరిగింది. ఆ సభలో వేణుమాధవ్ మిమిక్రీ ప్రోగ్రాం చేశాడు. ఆ ప్రోగ్రాంకి సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డిలు కూడా హాజరై వేణు మిమిక్రీ చూశారు. ఇట్లు, వడలు, గులగుల జామ్ అనే కామెడీ వారికి బాగా నచ్చి ఇదే బిట్ మా సినిమాలో చేస్తావా అని అడిగారు సరే అన్నాడు వేణు. హాస్యనటుడు బ్రహ్మానందం కాంబినేషన్లో మొదటిసారిగా "సంప్రదాయం" సినిమాలో వేణు నటించాడు. 1996 జనవరి 14న సంప్రదాయం సినిమా విడుదలయ్యే నాటికి ప్రివ్యూ చూసి శ్రీకారం, మెరుపు సినిమాలలో అవకాశాలు ఇచ్చారు. వేణుమాధవ్‌కి పవన్ కల్యాణ్ తొలిప్రేమ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆది, దిల్, సింహాద్రి, సై, ఛత్రపతి, లక్ష్మి, బెండ్ అప్పారావు, చెన్నకేశవరెడ్డి, అన్నవరం, జై చిరంజీవ, ఆకాశవీధిలో, వెంకీ , దిల్, ఆయుధం, ఆంధ్రావాలా, రుద్రమదేవి సినిమాలలో వేణు చేసిన పాత్రలు జనాల్లోకి దూసుకుపోయాయి.
హీరోగా హంగామా
ఓ రోజు దర్శక, నిర్మాత ఎస్వీ కృష్ణారెడ్డి వేణుమాధవ్ కి ఫోన్ చేసి మా నెక్స్ట్ సినిమాలో నువ్వే హీరో అన్నారు. వేణు జోక్ చేస్తున్నారేమో అనుకున్నాడు కానీ నిజంగా నే హంగామా సినిమాతో హీరో అయ్యాడు. ఆ సినిమా హిట్ కావడంతో తను హీరోగా నటించిన భూకైలాస్, ప్రేమాభిషేకం సినిమాలు కూడా విజయపథంలో దూసు కెళ్లాయి. ఇలా సినిమా రంగంలో దాదాపు 450 సినిమాలలో భిన్నమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. వెంకటేష్ హీరోగా 2006లో విడుదలైన లక్ష్మీ సినిమాలో తను పోషించిన పాత్రకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ హాస్య నటుడిగా గుర్తించి నంది అవార్డు ఇచ్చింది. తన భార్య శ్రీవాణి, ఇద్దరు కుమారులతో హాయిగా కొనసాగుతున్న వేణు జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. వేణుకి కాలేయ సంబంధిత వ్యా ధి రావడంతో చికిత్స పొందుతూ.. 2019 సెప్టెంబర్ 25న శాశ్వత నిద్రలోకి వెళ్లాడు. తను భౌతికంగా లేకపోయినప్పటికీ తను నటించిన పాత్రల రూపంలో వేణుమాధవ్ ఎప్పటికీ సజీవంగానే ఉంటాడు.
- వేముల వెంకటేశ్వర్లు,
తెలుగు లెక్చరర్, కేఆర్ఆర్ జూ.కాలేజి, కోదాడ