- 12 కేసుల్లో 6 కేసులను కొట్టేసిన కోర్టులు
- సరైన సాక్ష్యాధారాలు అందించని ఎక్సైజ్ అధికారులు
- ఫోరెన్సిక్ రిపోర్ట్‌ల ఆధారంగా తీర్పులు
- పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్ సహా పలువురిపై కేసులు కొట్టివేత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కోర్టుల్లో వీగిపోతున్నాయి. మొత్తం 12 కేసుల్లో ఎక్సైజ్ అధికారులు సరైన సాక్ష్యాధారాలు అందించకపోడంతో 6 కేసులను కొట్టివేశాయి. మరో 6 కేసులు వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. ఎన్‌డీపీఎస్ ప్రొసీజర్‌ను ఎక్సైజ్ అధికారులు పాటించకపోవడం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) రిపోర్టుల్లో సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేకపోవడంతో కేసులను కొట్టివేసినట్లు తెలిసింది.
గత 4 నెలల్లో నాంపల్లి, రంగారెడ్డి, సికింద్రాబాద్ కోర్టులు ఆరు కేసుల్లో తీర్పులు వెలువరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, డ్రగ్స్ సప్లయర్ కెల్విన్, పాతబస్తీకి చెందిన అబ్దుల్ వాహిద్, అబ్దుల్ ఖుద్దూస్‌ను 2017 జూన్‌లో ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. కెల్విన్ ఫోన్‌లో సుమారు 2,143 మంది ఫోన్ నంబర్స్, 30కి పైగా వాట్సప్ గ్రూపులను ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఇందులో టాలీవుడ్‌కు చెందిన హీరోలు రవితేజ, తరుణ్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ముమైత్ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, చార్మి సహా మొత్తం 11 మంది టాలీవుడ్ నటుల వివరాలు బయటపడ్డాయి.
ఈ కేసు సంచలనం సృష్టించడంతో అప్పటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేశారు. మొత్తం 12 కేసులు రిజిస్టర్ చేశారు. టాలీవుడ్ నటులు, వ్యాపారవేత్తలు, పలువురు రాజకీయ నాయకుల కుమారుల వివరాలనూ సేకరించారు. అనుమానితులకు నోటీసులు ఇచ్చి విచారించారు. సెలబ్రిటీలను 11 రోజులు సుమారు 88 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. సెలబ్రిటీల నుంచి బ్లడ్ శాంపుల్స్, గోళ్లు, వెంట్రుకల శాంపుల్స్ సేకరించారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించి రిపోర్టులు తెప్పించారు.
అయితే, వారి నుంచి సేకరించిన శాంపుల్స్‌లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్‌ఎస్‌ఎల్ తేల్చింది. దీంతో రవితేజ, తరుణ్, పూరీ జగన్నాథ్ సహా మిగతా టాలీవుడ్ సెలబ్రిటీల మీదున్న ఆరు కేసులను కోర్టులు కొట్టివేశాయి. కేసును నిరూపించేందుకు సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిపైనున్న కేసులను కొట్టేస్తూ తీర్పు ఇచ్చాయి. దాదాపు అన్ని కేసుల్లో టాలీవుడ్ నటులు, నిందితులకు క్లీన్ చిట్ వచ్చినట్లు తెలిసింది.