పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం, అల్లు అర్జున్ అరెస్ట్ ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు గురువారం (డిసెంబర్ 26) ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం జరుగనుంది. ఈ భేటీ కోసం సినీ పెద్దలు ఒకొక్కరిగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకుంటున్నారు.
ఇప్పటికే మురళీమోహన్, నాగార్జున, అల్లు అరవింద్, దిల్ రాజు సహా మరికొందరు నిర్మాతలు, నటులు బంజారాహిల్స్‌లోని కంట్రోల్ కమాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వీరు భేటీ కానున్నారు. సినీప్రముఖులతో మీటింగ్ ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. సినీ ప్రముఖులతో చర్చించాల్సిన విషయాలపైనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.