అందం, అభినయం ఆమె సొంతం. చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టం ఉన్నా అంతగా దృష్టి పెట్టలేదు. చదువు పూర్తయ్యాక యాక్టింగ్ మీదకు మనసు మళ్లింది. అదే మాట ఇంట్లో చెప్తే ‘నో’ అన్నారు. ‘టైం ఇవ్వండి ప్రూవ్ చేసుకుంటా.. లేదంటే నా ఆలోచన మార్చుకుంటా’ అని రిక్వెస్ట్ చేసింది. ‘ఓకే’ అన్నారు ఇంట్లో వాళ్లు. తనేంటో నిరూపించుకునేందుకు అడిగిన టైం కంటే ముందే సక్సెస్ సాధించిన బ్యూటిఫుల్ హీరోయిన్ కశ్మీరా పర్దేశి. ‘నర్తనశాల’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి తెలుగు సినిమాలతో టాలీవుడ్లో కనిపించిన ఈ క్యూట్ గర్ల్ తన షార్ట్ కెరీర్ గురించి పంచుకున్న స్వీట్ మెమరీస్ ఇవి.
‘‘మాది పుణె. నాన్న మహేంద్ర పోలీస్. అమ్మ స్వాతి. నాకో తమ్ముడు. వాడి పేరు వీరేంద్ర పర్దేశి. చిన్నప్పుడు సెయింట్ఆన్స్ స్కూల్లో చదివా. తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం ముంబై వెళ్లా. ముంబైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ కమ్యూనికేషన్ డిజైనింగ్ చేశా. మోడలింగ్ కూడా చేశా. కానీ, ఆ రెండింటినీ కెరీర్‌గా తీసుకోవాలనుకోలేదు. బుక్స్ చదవడం, డాన్స్ చేయడం, ట్రావెలింగ్ వంటివి నా హాబీలు. వాటిని కూడా కెరీర్‌గా ఎంచుకోలేను. కాబట్టి బాగా ఆలోచించా. చిన్నప్పటి నుంచి ఇష్టం ఉన్న యాక్టింగ్ వైపే వెళ్లాలనుకున్నా. అలా యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యా. అలా అనుకున్నానే కానీ ఈ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేదు. అందుకని థియేటర్ ఆర్టిస్ట్‌గా చేరాలని డిసైడ్ అయ్యా.
ఒక ఏడాది టైం ఇచ్చారు
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ‘సినిమాల్లో నటించాలనుంది’ అని ఇంట్లో చెప్పా. మొదట్లో మా ఫ్యామిలీ అందుకు ఒప్పుకోలేదు. కానీ, నేను ఒక ఏడాది టైం అడిగా. నా ప్రయత్నాలు నేను చేస్తా. నేను ఫెయిల్ అయితే ఆ తర్వాత మళ్లీ డిజైనింగ్‌నే ప్రొఫెషన్‌గా చేసుకుంటా అని చెప్పా. దాంతో వాళ్లు సరేనన్నారు. ఆ తరువాత థియేటర్లో చేరా. అక్కడ యాక్టింగ్ నేర్చుకుంటున్న టైంలో దక్షిణాది నుంచి అవకాశాలు వచ్చాయి. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత థియేటర్ ఆర్టిస్ట్‌గా నాటకాల్లో చేయడం కంటిన్యూ చేశా. అప్పుడు ఒక కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లో నటించే అవకాశం వచ్చింది. అందులో చూసి తెలుగు ప్రొడ్యూసర్స్ నన్ను కలిశారు. వాళ్లతో మాట్లాడాక నాకు సినిమా మీద నమ్మకం వచ్చింది. దాంతో ఆ సినిమాకి ఆడిషన్ ఇచ్చేందుకు ఒప్పుకున్నా. అన్ని ఎమోషన్స్ బాగా పలుకుతున్నాయా? లేదా అని చూశారు డైరెక్టర్. ఆయనకు నా నటన నచ్చడంతో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత స్ర్కిప్ట్ చెప్పారు. అదే నాగశౌర్య హీరోగా, నేను హీరోయిన్గా నటించిన ‘నర్తనశాల’. ఆ సినిమాలో నా క్యారెక్టర్‌కి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఇదిలా ఉండగా... ‘నర్తనశాల’ సినిమా ఓకే అయిన కొన్ని నెలల్లోనే బాలీవుడ్లో ‘మిషన్ మంగళ్’ అనే సినిమాలో ఆఫర్ వచ్చింది. అందులో అక్షయ్ కుమార్ హీరో, నాది విద్యాబాలన్ కూతురి పాత్ర. కథ నచ్చడంతో ‘ఓకే’ చెప్పేశా. అదే టైంలో మరాఠీలో ‘రాంపాట్’, తమిళంలో ‘శివప్పు మంజల్ పచ్ఛయ్’ (తెలుగులో ఒరేయ్! బామ్మర్ది) సినిమాల్లోనూ లీడ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. అలా 2018, 2019 సంవత్సరాల్లో వరుసగా నాలుగు సినిమాలు చేశా. కెరీర్ బిగినింగ్‌లోనే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రావడం నా అదృష్టం. అప్పటి నుంచి నా కెరీర్ కంటిన్యూ అవుతోంది.
టాలీవుడ్ నాకు చాలా స్పెషల్
తెలుగు ఇండస్ట్రీ నాకు చాలా బాగా నచ్చింది. నా సినిమా కెరీర్ ఇక్కడే మొదలైంది. అందుకే ఇది నాకు చాలా స్పెషల్. తెలుగు లాంగ్వేజ్ నా మాతృభాషకు దగ్గరగా ఉందనిపిస్తుంది. త్వరగా అర్థం అవుతుంది. ఇక్కడి వాతావరణం కూడా మా హోంటౌన్లో ఉన్నట్లే ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అన్నిరకాలుగా నాకు ఇక్కడ చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ఇంకా చెప్పాలంటే.. హైదరాబాద్‌తో నాకు ఉన్నది స్పెషల్ బాండ్. అదేంటంటే... నాకు దాదాపు పన్నెండేండ్లు ఉన్నప్పుడు మా అమ్మమ్మతో రామోజీ ఫిల్మ్ సిటీ ట్రిప్‌కి వచ్చా. అమ్మమ్మతో నాకు ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. ఆమె ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదు. కానీ ఇప్పుడు ఆమెతో కలిసి తిరిగిన రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్‌లు చేస్తుంటే ఆమెతో ఉన్నప్పటి జ్ఞాపకాలు కళ్లముందు మెదిలిన ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను.
డైలాగ్స్ ప్రిపరేషన్
వేర్వేరు భాషల్లో నటించేటప్పుడు డైలాగ్స్ నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఉదాహరణకు తెలుగు... మాట్లాడేటప్పుడు భాష ఒకలా, స్క్రిప్ట్‌లో చదువుతుంటే మరోలా అనిపించేది. అందుకని పేపర్ మీద చదువుకుని చెప్పడం కంటే వినడం బెటర్ అనిపించింది. అందుకని అసిస్టెంట్ డైరెక్టర్, నా డైలాగ్స్‌ని వాయిస్ మెసేజ్‌లో పంపేవాళ్లు. అవి వింటూ నేర్చుకునేదాన్ని. ట్రావెలింగ్‌లో ఉన్నా, ఖాళీ టైం దొరికినా ప్రాక్టీస్ చేసేదాన్ని. చెప్పాలంటే.. భాష అనేది యాక్టర్‌కి అడ్డుగోడ కాదు. ఈ మధ్య అందరూ అన్ని భాషల సినిమాలు చేస్తున్నారు.
చాలా కాలం తర్వాత
‘నర్తనశాల’ (2018) తర్వాత ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (2023) వచ్చే వరకు మళ్లీ తెలుగులో నటించలేదు. అందుకు కారణం తమిళ, కన్నడ, హిందీ సినిమాలతో బిజీగా! ఒకసారి షూటింగ్ కోసం చెన్నైలో ఉన్నప్పుడు బాలాజీ టెంపుల్‌కి వెళ్లా. దర్శనం అయి బయటకు వస్తుండగా గీతా ఆర్ట్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అది ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా కోసం. వెంటనే హైదరాబాద్ వచ్చి స్క్రిప్ట్ విన్నా. నెరేషన్ పూర్తికాకముందే నాకు కథ బాగా నచ్చేసింది.
ఆలియా అవకాశం అలా
నేను గతేడాది సెప్టెంబర్‌లో కేరళలోని అలెప్పీలో షూటింగ్ చేస్తున్నా. అప్పుడు శుభమ్ సర్ నుంచి ‘హాట్ స్టార్ స్పెషల్ కోసం నీరజ్ పాండే డైరెక్షన్లో లీడ్ రోల్ చేసే యాక్ట్రెస్ కోసం చూస్తున్నాం’ అని ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడగానే.. ‘నేను యాక్టర్ అయ్యాక కొంతమంది డైరెక్టర్స్‌తో కలిసి పనిచేయాలని కలలు కనేదాన్ని. అలాంటి వాళ్లలో నీరజ్ పాండే కూడా ఒకరు. దాంతో ఆ తర్వాతి రోజే నేను ఆడిషన్ టేప్ పంపించా. అంతే త్వరగా నా పేరు షార్ట్ లిస్ట్‌లో చేరింది. ఆ తర్వాత చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ‘ఇక ఇది జరిగేలా లేదు’ అని డిజప్పాయింట్ అయ్యా. మామూలుగా అయితే ఆడిషన్ ఇచ్చాక వస్తే వస్తుంది, లేకపోతే లేదు అన్నట్టు ఉంటా. కానీ, ఆలియా పాత్ర నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అలా ఉండలేకపోయా. ఆలియా నేనే అన్నట్లు ఫీలయ్యా. కానీ.. వర్కవుట్ అవ్వట్లేదని ఆశలు వదిలేశా. చాలా బాధపడ్డా. చివరికి ఏప్రిల్‌లో ఆ పాత్రకు నేను ఓకే అయినట్లు ఫోన్ కాల్ వచ్చింది.
ఆలియాగా...
‘ది ఫ్రీలాన్సర్’లో ఆలియా అనే ముస్లిం అమ్మాయి పాత్రలో నటించా. సిరియాలో చిక్కుకున్న అమ్మాయి కథ. ‘టికెట్ టు సిరియా’ పుస్తకం ఈ సినిమాకు మూలం. ఆ పుస్తకం నేను కూడా చదివా. స్క్రిప్ట్ చదివాక, క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టా. అందుకోసం దీనిపై వచ్చిన డాక్యుమెంటరీలు చాలా చూశా. అందులో ఆలియా పాత్రకు చాలా ఎమోషన్స్ ఉంటాయి. వాటన్నింటినీ నేను ఫీల్ అవ్వాలి. ఆలియా ఎలా ట్రాప్‌లో పడింది? బయటకు రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది? అనేవి చూపించాలి. ఆ సీక్వెన్స్ చేశాక ఎన్నో రాత్రుళ్లు నాకు నిద్ర పట్టలేదు. ప్రతిదానికీ భయపడేదాన్ని. ఎవరిని నమ్మాలన్నా అనుమానమే. కానీ ఆ తరువాత నాకు అర్ధమైంది ఏంటంటే... ఆ క్యారెక్టర్లో నుంచి బయటికొస్తే నేను మళ్లీ నార్మల్‌గా ఉండొచ్చు. అప్పుడే మిగతా షెడ్యూల్‌ని మంచిగా పూర్తిచేయగలను అనిపించింది