విధిరాత : పాటల రచయిత కులశేఖర్ కన్నుమూత.. దొంగతనం కేసుల్లో జైలుకు.. పిచ్చోడిగా మారి.. చివరికి ఇలా..!

విధిరాత : పాటల రచయిత కులశేఖర్ కన్నుమూత.. దొంగతనం కేసుల్లో జైలుకు.. పిచ్చోడిగా మారి.. చివరికి ఇలా..!

టాలీవుడ్ ప్రముఖ సినీ గీత రచయిత కులశేఖర్ (53) (Kulasekhar) చనిపోయారు. ఇవాళ మంగళవారం (2024 నవంబర్ 26న) ఉదయం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన కెరీర్లో సుమారు 100 సినిమాలకి పైగా పాటలు రాసి తిరుగులేని రైటర్గా ఎదిగిన కులశేఖర్.. తన చివరి రోజుల్లో ఇలా దయనీయ స్థితిలో చనిపోవడం ఆయన అభిమానులకి తీరని లోటును మిగిల్చింది. 

సింహాచలంలో జన్మించిన కుల శేఖర్‌ పలు మీడియా సంస్థల్లో విలేకరిగా పని చేసి అనంతరం చిత్ర పరిశ్రమలోకి వెళ్లారు. మొదట సిరివెన్నెల సీతారామశాస్త్రి  దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెలకువలు తెలుసుకున్నాడు.

ఆ తర్వాత  కులశేఖర్ ముఖ్యంగా దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ దగ్గర అనేక విజయవంతమైన చిత్రాలకు పాటలు రాశాడు. అందులో చిత్రం, 10 క్లాస్, వసంతం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా,సుబ్బు, ఘర్షణ, సైనికుడు వంటి సినిమాలకు పాటలు రాసి మంచి పేరు సంపాదించుకున్నారు. స్టార్ రైటర్ గానే కాకుండా.. ప్రేమలేఖ రాశా మూవీకి దర్శకత్వం వహించాడు. ఇందులో బింబిసార, విశ్వంభర చిత్రాల డైరెక్టర్ వశిష్ట మల్లిడి హీరోగా నటించాడు.

అయితే, కులశేఖర్ 2013లో ఓ గుడిలో దొంగతనం కేసులో జైలుపాలయ్యారు. ఆరునెలలు జైలు శిక్ష గడిపారు. ఒంటరితనం, అనారోగ్యంతో తీవ్ర మనోవేదనకి గురయ్యారు. అంత సూపర్ హిట్స్ సాంగ్స్ రాసిన కులశేఖర్ కు టాలీవుడ్ లో అవకాశాలు దక్కలేదు. ఆర్ధికంగా చితికిపోయారు. దాంతో కులశేఖర్ మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. ఓ వెలుగు వెలగాల్సిన రచయితను విధిరాత ఇలా కాటేసింది. తన చివరి దశలో వివాదాలతో గడిపిన కులశేఖర్.. ఇప్పుడు ఈ లోకాన్ని తన 53 ఏళ్ల వయసులో విడిచిపెట్టారు.

ఆయన రాసిన పాటల్లో జయంలోని 'రాను రాను అంటుంది చిన్నదో', 'అందమైన మనుసులో ఇంత అలజడి ఎందుకు',  నువ్వు నేను మూవీలో 'గాజువాక పిల్లామీ', వసంతంలో 'ఆమ్మో అమ్మోయేనా', ఘర్షణ లో 'చెలియా చెలియా', 'ఏ చిలిపి కళ్లలోన కలవో', బొమ్మరిల్లు సినిమాలో అపుడో ఇపుడో ఎపుడో, హ్యపీ మూవీలో 'ఎగిరే మబ్బుల్లోనా'.. ఇంతేకాకుండా చాలా సినిమాల్లో గుర్తిండిపోయే పాటలు రాసాడు కులశేఖర్.