టాలీవుడ్ లో టెన్షన్..బెన్ఫిట్ షోలు, టికెట్ రేట్లపై హైరానా!

టాలీవుడ్ లో  టెన్షన్..బెన్ఫిట్ షోలు, టికెట్ రేట్లపై హైరానా!
  •  బెన్ఫిట్ షోలు, టికెట్ రేట్లపై హైరానా!
  • ఒక్కటవుతున్న నిర్మాతలు, సినీ పెద్దలు
  • అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుపై ఆందోళన
  • సంక్రాంతి సినిమాలకు ఎఫెక్ట్ అని టెన్షన్
  • సర్కారుతో చర్చలకు వెళ్లేందుకు సినీ పెద్దల ప్లాన్
  • రంగంలోకి దిగిన నిర్మాత నాగ్ వంశీ
  •  దిల్ రాజు తో కలిసి వెళ్లి చర్చలకు ఏర్పాట్లు

హైదరాబాద్: పుష్ప వివాదం టాలీవుడ్ ను టెన్షన్ పెడుతోంది. బెన్ఫిట్ షోలను రద్దు చేస్తున్నట్టు, టికెట్  రేట్లను పెంచుకునేందుకు అనుమతి లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనతో ఆందోళన మొదలైంది. సంక్రాంతికి మూడు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపునకు అనుమతి లేకుండా నిండా నష్టపోతామని నిర్మాతలు, దర్శకులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంక్రాంతికి రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్,  బాలకృష్ణ సినిమా డాకుమహరాజ్, విక్టరీ వెంకటేశ్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం.. రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాల్లో గేమ్ చేంజర్  భారీ బడ్జెట్ మూవీ.. అదే విధంగా గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం.. సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటన ప్రకారం బెన్ఫిట్ షోలు, టికెట్ల ధర పెంపు ఉండదు.. అదే జరిగితే ఇబ్బందులు తప్పవనే  భావన సినీ నిర్మాతల్లో నెలకొంది. 

సర్కారుపైనే ప్రెస్ మీటా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత గంటల వ్యవధిలో అల్లు అర్జున్ తన  నివాసంలో ప్రెస్ మీట్  పెట్టి.. తన వ్యక్తిత్వ హననం చేశారంటూ సీఎంను ఉద్దేశించి మాట్లాడటాన్ని సినీ నిర్మాతలు తప్పుపడుతున్నారు. అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటున్నారు. ప్రభుత్వం సహకరిస్తేనే ఇండస్ట్రీ మనగలుగుతుందనే భావనను వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా గ్యాప్ పెరిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత ఓయూ జేఏసీ విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. అల్లు అర్జున్ ప్రెస్  మీట్ పెట్టి ఉండకపోతేజనాల్లో వ్యతిరేకత వచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

సీఎంను కలిసే  యోచనలో ఇండస్ట్రీ

తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చాక నిర్మాతలు సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ ఇవాళ మీడియాకు వెల్లడించారు.  రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’మూవీ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఉన్న నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు  హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక సీఎంను కలుస్తామని చెప్పారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామని నాగవంశీ తెలిపారు. 

ALSO READ | Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌.. కన్నప్ప కామిక్‌ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్.. ఎక్కడ చూడాలంటే?

హైదరాబాద్ లోనే టాలీవుడ్ (బాక్స్)

సినీ పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదని, హైదరాబాద్ లో ఉంటుందని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని కుండబద్దలు కొట్టారు. తాను చాలా డబ్బులు పెట్టి హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నాని అన్నారు.  మరో ప్రాంతానికి ఎందుకు వెళ్తానన్నారు. ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం నుంచి  సపోర్ట్‌ ఉంటుందని పవన్‌ కల్యాణ్‌ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి చెబుతూనే ఉన్నారన్నారు.