ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ రంగరాజు (Vijaya Rangaraju)అలియాస్ రాజ్ కుమార్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ఓ ప్రవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో నటుడు విజయ రంగరాజు మరణించినట్లు సమాచారం.
అయితే, వారం క్రితం హైదరాబాద్లో ఒక సినిమా షూటింగ్లో విజయ రంగరాజు గాయపడటంతో ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా విజయ రంగరాజుకి గుండెపోటు అటాక్ కావడంతో చనిపోయారు. దాంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆయనకి ఇద్దరు కూతుళ్లు.
విజయ రంగరాజు సినీ ప్రస్థానం:
విజయ రంగరాజు మద్రాసులో రంగస్థల కళాకారునిగా అనేక నాటకాలలో నటించాడు. మోహన్ లాల్ నటించిన వియత్నాం కాలనీ అనే మలయాళ సినిమాతో సినిమా రంగంలో అరంగేట్రం చేసాడు. ఆ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 150 రోజులు ఆడడంతో అతని నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో తెలుగులో వరుస అవకాశాలు దక్కాయి.
ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన 'సీతా కళ్యాణం' రంగరాజుకు నటుడిగా తెలుగులో మొదటి సినిమా. అయితే 1994 లో వచ్చిన భైరవ ద్వీపం చిత్రంతో రంగరాజు నటనకు ఎంతో పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయన ఎక్కువగా విలన్, సహాయ పాత్రలు పోషించి టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా నటుడు విజయ రంగరాజు అంటే.. టక్కున గుర్తొచ్చే సినిమా అంటే.. 'యజ్ఞం' అని చెప్పుకోవాలి. గోపీచంద్ యజ్ఞం చిత్రంలో విలన్ పాత్రలో విజయ రంగరాజు జీవించేశాడు.
ఇ.వి.వి.సత్యనారాయణ తీసిన 'మగరాయుడు' సినిమాలో రంగరాజు 'జిన్నా' పాత్రలో నటించడంతో రెండో ఇన్నింగ్స్ యజ్ఞంతో మొదలెట్టాడు. ఆ తర్వాత విశాఖ ఎక్స్‌ప్రెస్, ఢమరుకం, బ్యాండ్ బాజా, శ్లోకం వంటి సినిమాల్లో వరుస అవకాశాలు అందుకున్నాడు.