
- నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో అడ్వకేట్ ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశా,రంటూ సినీ నటులు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ లపై అడ్వకేట్ఇమ్మనేని రామారావు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేశారు. ఇదివరకే దగ్గుబాటి రానా, విజయ్ దేవర కొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, యాంకర్ శ్యామల, శ్రీముఖి, విష్ణుప్రియ, బిగ్‌బాస్ పార్టిసిపెంట్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై బెట్టింగ్ ప్రమోట్ చేశారంటూ కేసులు నమోదైన సంగతి తెలిసింది. తాజాగా బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై ఫిర్యాదు వచ్చింది.
ఈ అగ్ర నటుల ప్రమోషన్ వల్ల వారిని అభిమానించే చాలామంది డబ్బులు నష్టపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ షోలో చైనాకు చెందిన ఫన్ 88 బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారని, అందులో బాలకృష్ణ ‘‘ఫన్ 88 యాప్ లో బెట్టింగ్ ఆడండి.. ఎక్కువ డబ్బులు గెలుచుకోండి’’ అంటూ ప్రమోట్ చేశారని పేర్కొన్నారు. ఈ షోలో ఒక ఎపిసోడ్ కు బాహుబలి–2 ప్రమోషన్ కోసం ప్రభాస్, గోపీచంద్ గెస్ట్లుగా వచ్చారని, ఈ ఎపిసోడ్లో ఫన్ 88 అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారని తెలిపారు. ఈ ఎపిసోడ్ చూసి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని బాధితులు సుమారు రూ. 83 లక్షలు పోగొట్టుకున్నారని.. ఇంకా బాధితులు చాలా మందే ఉన్నారని తెలిపారు. అయితే, ఈ ఫిర్యాదుపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.