ILT20: క్రీడా స్ఫూర్తా..! తొక్కా..! ముంబై కోచ్‌ను తిట్టిపోస్తున్న అభిమానులు

ILT20: క్రీడా స్ఫూర్తా..! తొక్కా..! ముంబై కోచ్‌ను తిట్టిపోస్తున్న అభిమానులు

ఇంటర్నేషనల్ టీ20 లీగ్(ILT20)లో భాగంగా శనివారం గల్ఫ్ జెయింట్స్, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఎమిరేట్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఔటైన బ్యాటర్‌ను నాటౌట్ ఇచ్చి సింపతీ కొట్టేద్దామనుకున్న ముంబై కోచ్‌ ఆండీ ఫ్లవర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ముంబై జట్టు ఓటమి పాలైంది. దాంతో, ఆ జట్టు అభిమానులు కోచ్‌పై తిట్ల పురాణం మొదలు పెట్టారు. 

అసలేం జరిగిందంటే..?

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. ఛేదనలో గల్ఫ్ విజయానికి చివరి 3 ఓవర్లలో 28 పరుగులు అవసరమయ్యాయి. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. ఆ సమయంలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. 18వ ఓవర్ ఆఖరి బంతికి టామ్ కరన్(16) అనూహ్య రీతిలో ఔటయ్యాడు. బంతి కీపర్ చేతుల్లోకి రాకముందే.. ఓవర్ ముగిసిందని భావించి క్రీజు నుండి బయటకు వెళ్లాడు. దాంతో, బంతి చేతికందుకున్న పూరన్‌కి వికెట్లను గిరాటేసి.. ఔట్ కోసం అప్పీల్ చేశాడు. సమీక్షించిన థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్ అని ప్రకటించాడు. వాస్తవానికి క్రికెట్ నిబంధనల ప్రకారం.. అది ఔట్. దాంతో, టామ్ కరన్ డగౌట్ వైపు పయనించాడు.   

ALSO READ | SA20: 20 ఓవర్లు స్పిన్నర్లే వేశారు.. టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డ్

క్రీడా స్ఫూర్తి..

సరిగ్గా ఆ సమయంలో ముంబై కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ ఎంట్రీ ఇచ్చాడు. పూరన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. క్రీడా స్ఫూర్తి(స్పిరిట్ ఆఫ్ ది గేమ్) పేరుతో అప్పీల్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలిపాడు. దాంతో, టామ్ కరన్ యథాతదంగా బ్యాటింగ్ కొనసాగించాడు. ముంబై  జట్టు ఓటమి పాలైంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

చెప్పలేని బూతులు..

క్రీడా స్ఫూర్తి పేరుతో అప్పీల్‌ను ఉపసంహరించుకోవడంపై ముంబై అభిమానులు.. కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ను తిడుతున్నారు. ఔటై డగౌట్‌కు వెళ్తున్న వాడిని ఎందుకు గెలికావ్ .. అంటూ అతన్ని బండబూతులు తిడుతున్నారు. నెట్టింట అటువంటి కామెంట్లు చాలా దర్శనమిస్తున్నాయి.