హైదరాబాద్ లో రూ. 140కి చేరిన టమాట ధర

భారీ వర్షాలతో పంటలు పాడవుతున్నాయి. ముఖ్యంగా కూరగాయ పంటలు దెబ్బతినడంతో.. వాటి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దిగుబడి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగాయి. ఏ కూరగాయ ధర చూసిన వంద పలుకుతోంది. టమాట ధరకైతే అడ్డేలేకుండాపోయింది. ప్రస్తుతం టమాట ధర రైతు బజార్ లో కిలో రూ.140కి చేరింది. చిక్కుడు, క్యారెట్, కాకరకాయ కిలోకి 60 నుంచి 70 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. బీరకాయ, పచ్చిమిర్చి, వంకాయ కిలో వందరూపాయలు దాటాయి. దాంతో 500 రూపాయలు పెడితే కేవలం రెండురోజులకు సరిపడా కూరగాయలు మాత్రమే వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. 

భారీవర్షాలకు చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో ధరలు పెరిగినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు చమురు ధరలు కూడా పెరగడంతో ట్రాన్స్ పోర్ట్ చార్జీలు పెరిగాయంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు కూరగాయాలు తీసుకురావాలంటే భారీ వ్యయం అవుతోందని రైతులు అంటున్నారు.