కామారెడ్డి, వెలుగు: మార్కెట్లో కూరగాయాల ధరలు భగ్గుమంటున్నాయి. సాగు విస్తీర్ణం తక్కువగా ఉండడం, వాతావరణ పరిస్థితుల అనుకూలంగా లేకపోవడం రేట్లపై ప్రభావం చూపుతోంది. జూన్ నెల మధ్యకు వచ్చినా ఎండల తీవ్రత తగ్గకపోవడం, మరో వైపు ఇక్కడి అవసరాలకు సరిపడా కూరగాయల ఉత్పత్తి లేక దూరప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో కామారెడ్డి జిల్లాలో వారం రోజులుగా కూరగాయల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా రూ.50, పచ్చిమిర్చి రూ.100 పలుకుతోంది. మిగతా కూరగాయలు కూడా కిలోకు రూ.40కి పైగానే ఉన్నాయి. టమాటా, పచ్చిమిర్చి రేట్లు వారంలోనే కిలోకు రూ.20 నుంచి రూ.40 వరకు పెరిగాయి. రోజురోజుకు ధరలు పెరుగుతుండడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
విస్తీర్ణం తక్కువ...
కామారెడ్డి వ్యవసాయిక జిల్లా అయినా కూరగాయల సాగు విస్తీర్ణం తక్కువగానే ఉంది. కొన్ని ఏరియాల్లోనే కూరగాయలు పండిస్తుంటారు. అన్ని రకాల కూరగాయలు కలిపి జిల్లాలో 4 వేల ఎకరాలకు మించి సాగు చేయడం లేదు. సదాశివ్నగర్, తాడ్వాయి, రాజంపేట, కామారెడ్డి, భిక్కనూరు, ఎల్లారెడ్డి, గాంధారి, బిచ్కుంద మండలాల్లోని కొన్ని ఊళ్లల్లోనే కూరగాయల సాగు ఉంది. ఎక్కువగా టమాటా, బెండ, వంకాయ, సొర, బీరకాయ, క్యాబేజీ, చిక్కుడు, ఆకుకూరలు పండిస్తుంటారు. తక్కువ విస్తీర్ణంలోనే పంట పండుతుండడంతో ఇక్కడి ప్రజల అవసరాలకు సరిపోక ఇతర ఏరియాల నుంచి దిగుబడి చేసుకోవాల్సి వస్తోంది.
వేరే ప్రాంతాల నుంచి దిగుమతి..
ఎక్కువగా వినియోగించే టమాటా, పచ్చి మిర్చి, అలుగడ్డలు, దొండ, క్యాస్పికమ్తో పాటు, బీర, వంకాయ, చిక్కుడు, దోస ఎక్కువ మొత్తం ఇతర ఏరియాల నుంచి వస్తోంది. టమాటా ఎక్కువగా ఏపీలోని చిత్తూరు జిల్లా మదనెపల్లి, అనంతాపూర్ఏరియాల నుంచి వస్తోంది. పచ్చిమిర్చి హైదరాబాద్, నిజామాబాద్నుంచి వస్తుంది. అక్కడి మార్కెట్లో ఉండే రేట్లకు రెండింతలు ఇక్కడి వ్యాపారులు అమ్ముతున్నారు. రవాణా చార్జీలు, వ్యాపారుల లాభాలు చూసుకొని ఎక్కువ రేట్లు పెంచుతున్నారు. ఇక్కడ దిగుబడి ఎక్కువగా వచ్చినప్పుడు తక్కువ రేట్లు ఉంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా రూ.50, పచ్చిమిర్చి రూ.100, బీరకాయ రూ.50, బెండ రూ.40, దొండ రూ.40, వంకాయ రూ. 45, చిక్కుడు రూ.50, ఆలుగడ్డ రూ.40, క్యాస్సికమ్రూ.50, ఆకుకూరలు కిలో రూ.50 పలుకుతున్నాయి.
అప్పుడు వర్షాలు.. ఇప్పుడు ఎండలు
ఇతర పంటల కంటే కూరగాయల సాగుకు ఎక్కువ శ్రమ ఉంటుంది. కోతులు, నెమళ్లు, అడవి పందుల బెడద అధికంగా ఉంటుంది. మరో వైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించడం లేదు. సబ్సిడీపై సీడ్స్సప్లయ్చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎక్కువ మంది రైతులు కూరగాయల్ని కాకుండా ఇతర పంటల్ని పండిస్తున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్నెలల్లో అకాల వర్షాలకు కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వానాకాలం వచ్చినా ఉష్ణోగ్రతలు భారీగా ఉన్నాయి. ఎండల తీవ్రతతో కూరగాయలు పాడవుతున్నాయి. తక్కువ విస్తీర్ణంలో సాగవ్వడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించక, దిగుబడి తగ్గి వినియోగదారులపై భారం పడుతోంది.
10 రోజుల్లోనే కిలోకు రూ.20 పెరిగింది..
10 రోజుల కింద కామారెడ్డి మార్కెట్లో కిలో టమాటా రూ.25 నుంచి రూ.30 ఉండేది. ఇప్పుడు రూ.50 ఉంది. కొద్ది రోజుల్లోనే కిలోకు రూ.20 పెరిగింది. వారానికి 2 కిలోల టమాటాలు కొనే నేను పెరిగిన
ధరలతో కిలో మాత్రమే కొన్నాను. మిర్చితో పాటు, ఇతర కూరగాయల రేట్లు ఎక్కువే ఉన్నాయి.
- శ్రీనివాస్, వినియోగదారు
ఎండలకు కూరగాయలు కాస్తలేవు..
2 నెలల కింద చెడగొట్టు వానలకు పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఎండలు బాగా ఉండటంతో కూరగాయలు ఎక్కువగా కాస్తలేవు. కోతుల బెడద కూడా ఎక్కువగానే ఉంది. రైతుల దగ్గర ఎక్కువ కూరగాయలు ఉన్నప్పుడు రేట్లు తగ్గుతున్నయ్. ఇప్పుడేమో మా దగ్గర తక్కువగా ఉన్నాయి. దీన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్రు.
- రాజయ్య, రైతు, సదాశివనగర్