ఇది టొమాటోల సీజన్. తక్కువ రేటుకి వచ్చినా స్టోర్ చేయడం కష్టమని ఒకటి, రెండు కేజీల కంటే ఎక్కువ కొనలేం. కానీ, సరిగా ప్యాక్ చేస్తే ఆరు నెలల వరకూ వీటిని స్టోర్ చేసుకోవచ్చు.
టొమాటోలకి ఎక్కువ రేటు ఉన్నప్పుడు ఖర్చులకి ఇబ్బంది పడకుండా వీటిని చక్కగా వాడుకోవచ్చు. టొమాటోలను ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే తాజా టొమాటోలను తీసుకోవాలి. సైజ్‌లో చిన్నవయితే ఇంకా మంచిది. టొమాటోలని -మంచి లేదా ఉప్పు వేసిన నీళ్లతో శుభ్రంగా కడగాలి. పొడిబట్టతో తుడిచి కాసేపు గాల్లో ఆరబెట్టాలి. -పుచ్చులు ఉన్న వాటిని తీసేయాలి. ముచ్చికలు తీసే కత్తి బాగా పదును ఉండాలి. అలాగైతేనే ఒకేసారి ముచ్చికను తీయొచ్చు. టొమాటో పాడవదు.
టొమాటో ముక్కలను తరిగేటప్పుడు మధ్యలోంచి మాత్రమే నిలువుగా కోయాలి. గింజలకు కత్తి టచ్ అవ్వనీయొద్దు. అలా చేస్తేనే టొమాటో పాడు కాదు. ఒకటి రెండు రోజులు ఈ ముక్కల్ని నిల్వ చేయాలనుకుంటే ర్యాప్ కవర్లో ముక్కల్ని ఉంచి, గాలి వెళ్లకుండా కవర్ని ఫోల్డ్ చేయాలి. పది, పదిహేను రోజుల వరకూ స్టోర్ చేయాలంటే మాత్రం ముక్కలు తరిగి స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే టొమాటోలనే నిల్వ చేయొచ్చు. ముచ్చికలు తీసేసి టొమాటోల్ని జిప్‌లాక్ బ్యాగ్‌లో వేయాలి. ఈ జిప్‌ను ఒక పక్క నుంచి టైట్ చేయాలి. చివర్లో లోపలకి ఒక స్ట్రా పెట్టాలి. లోపలున్న గాలిని బయటకు పీల్చేయాలి. దీనివల్ల కవర్లో కొంచెం కూడా గాలి ఉండదు. -ఫ్రిజ్ నుంచి టొమాటోలను తీసిన ప్రతిసారీ ఇదే ప్రాసెస్‌లో చేయాలి. నాలుగైదు నెలలు నిల్వ ఉంచాలనుకుంటే ఎయిర్ టైట్ బ్యాగ్‌లో స్టోర్ చేసిన పది రోజుల తర్వాత బయటకు తీసి ఫ్రీజర్ బాక్స్‌లో ఉంచి మళ్లీ స్టోర్ చేయాలి.
ఫ్రీజర్ నుంచి బయటకు తీశాక
టొమాటోలను ఫ్రీజర్ నుంచి బయటకు తీసిన తర్వాత ముక్కలను ఒకలా, టొమాటోలను ఒకలా వాడాలి. చాలా రోజుల తర్వాత ఫ్రీజర్ నుంచి బయటకు తీస్తే గట్టిగా, రాయిలా మారతాయి. వెంటనే వండడానికి కుదరదు. మళ్లీ వాటిని నార్మల్ టెంపరేచర్‌కు తేవాలి. టొమాటోలను బయటకు తీశాక పది నిమిషాలు అలానే ఉంచాలి. -టొమాటో ముక్కలు అయితే 30 సెకన్లు, టొమాటోలైతే రెండు నిమిషాలు ఒవెన్‌లో ఉంచాలి. ఒవెన్ లేకపోతే మరుగుతున్న నీళ్లలో రెండు నిమిషాలు ఉడికించి, ఆ తర్వాత తొక్కుతీయాలి. సరిగా నిల్వ చేస్తే ఆరు నెలల వరకూ టొమాటోలు పాడుకావు.