ఉత్తరప్రదేశ్ : దేశంలో టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు టమాటా కొనలేని స్థితికి చేరుకున్నారు. టమాటాలకు ఫుల్ డిమాండ్ ఉంది. బంగారం, వెండికి ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడు టమాటాలకు కూడా అంతే డిమాండ్ ఉంది. అందుకే.. దొంగలు గోల్డ్, వెండి, డబ్బులను కాదు.. టమాటాలను కూడా ఎత్తుకెళ్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
ధరలు పెరగడంతో కొంతకాలంగా పలు చోట్ల టమాటాలు చోరీకి గురవుతున్నాయి. నిత్యం టమాటాలకు సంబంధించిన స్టోరీలు ఏదో ఒకటి వింటూనే ఉన్నాం. తాజాగా ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలోని మార్కెట్ ప్రాంతంలోని రెండు దుకాణాల్లో అర్ధరాత్రి సమయంలో టమాటాలను జులై 10న (సోమవారం) ఎత్తుకెళ్లారు దొంగలు.
షాపు యజమానులు రామ్‌జీ, నయీమ్‌ఖాన్ ఇద్దరూ దుకాణాలు మూసివేసి రాత్రి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం తమ దుకాణాలు తెరిచి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. షాపులోకి వెళ్లి తనిఖీ చేయగా టమోటాలు, అల్లం, మిరపకాయలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే ఈ ఇద్దరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మొత్తం 26 కిలోల టమోటాలు, 25 కిలోల మిర్చి, 8 కిలోల అల్లం చోరీకి గురైనట్లు పోలీసులు గురువారం (జులై 13న) తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కమతా ప్రసాద్, మహ్మద్ ఇస్లాం అనే ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ వార్తను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రాష్ట్ర పోలీసులపై మండిపడ్డారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పేరును ‘స్పెషల్ టొమాటో ఫోర్స్’గా మార్చాలని సూచించారు.
https://twitter.com/yadavakhilesh/status/1679330619896246272