రేపు మునుగోడుకు ఐదుగురు మంత్రులు.. కేటీఆర్​ నేతృత్వంలో సమీక్ష

టీఆర్ఎస్​ ను గెలిపిస్తే  మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని బైపోల్​ ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీపై మంత్రి కేటీఆర్​ దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా  నియోజకవర్గ సమస్యలపై సమీక్షించడానికి మరో నలుగురు రాష్ట్ర మంత్రులు జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లతో కలిసి డిసెంబరు 1న (గురువారం) మంత్రి కేటీఆర్​ మునుగోడుకు వెళ్లనున్నారు.  

స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులపై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మునుగోడు పట్టణంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో  సమీక్ష సమావేశం జరగనుంది. ఈ మీటింగ్​లో చర్చించేందుకు మునుగోడు నియోజకవర్గ సమస్యలపై  ఉన్నతాధికారులు ఒక నివేదికను రూపొందించారని తెలుస్తోంది. రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లు, మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలు కేంద్రంగా సమావేశం జరగొచ్చని అంచనా వేస్తున్నారు.