- 30 సెంటర్లు.. 166 కౌంటింగ్ హాల్స్ సిద్ధం
- సమానంగా ఓట్లొస్తే డ్రాతో విన్ డిక్లేర్: ఎస్‌ఈసీ
హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా 30 సర్కిళ్లలో కౌంటింగ్ సెంటర్లను రెడీ చేసింది. 150 వార్డుల ఓట్ల లెక్కింపు శుక్రవారం పొద్దున 8 గంటలకు స్టార్టవనుంది. 30 సెంటర్లలో కలిపి 166 కౌంటింగ్ హాల్స్‌ను ఎస్‌ఈసీ ఏర్పాటు చేసింది. ఒక్కో హాల్‌లో 14 కౌంటింగ్ టేబుల్స్ సిద్ధం చేసింది. ప్రతి కౌంటింగ్ హాల్‌లో ఓ రిటర్నింగ్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కౌంటింగ్ ప్రాసెస్‌ను పర్యవేక్షించనున్నారు. లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి కౌంటింగ్ సెంటర్‌లో ఓ అబ్జర్వర్‌ను నియమించనున్నారు. పోటీలోని క్యాండిండేట్లు ఒక్కో కౌంటింగ్ టేబుల్ దగ్గర ఒక్కో ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. క్యాండిడేట్ లేదా క్యాండిడేట్ తరఫు ఎలక్షన్ ఏజెంట్, అడిషనల్ కౌంటింగ్ ఏజెంట్‌నే కౌంటింగ్ టేబుల్ దగ్గరకు అనుమతిస్తారు. హాల్‌లో లెక్కింపు ప్రక్రియ అంతా సీసీటీవీ కెమెరా లేదా వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయనున్నారు. ఓట్ల కౌంటింగ్‌కు వచ్చే ఏజెంట్లకు రిలీఫ్ ఏజెంట్‌ను ఇవ్వబోమని, కౌంటింగ్ హాళ్లలోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారని చెప్పింది. డౌట్ ఫుల్ ఓట్లపై రిటర్నింగ్ ఆఫీసర్‌దే తుది నిర్ణయమని వెల్లడించింది.
కరోనా రూల్స్ పాటించాలి
క్యాండిడేట్ల వారీగా చెల్లుబాటైన ఓట్లను రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించాక అభ్యంతరాలుంటే క్యాండిడేట్లు లిఖితపూర్వకంగా రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. క్యాండిడేట్లకు ఓట్లు సమానంగా వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ డ్రా ద్వారా విజేతను ప్రకటిస్తారు. కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు పెట్టుకోవాలని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని, శానిటైజర్వాడుతూ కరోనా మార్గదర్శకాలు పాటించాలని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్లే ఉద్యోగులంతా పీపీఈ కిట్లు ధరించాలని ఆదేశించారు.
అబ్జర్వర్ల నియామకం
ఎన్నికల కౌంటింగ్ ప్రాసెస్‌ను పర్యవేక్షించేందుకు సర్కిళ్ల వారీగా అబ్జర్వర్లను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్హోదాలో పనిచేస్తున్న 31 మందిని అపాయింట్ చేసింది.