రేపే(సెప్టెంబర్ 15న) టెట్.. నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ

  • అటెండ్​ కానున్న 2.91 లక్షల మంది అభ్యర్థులు
  • నిమిషం నిబంధన అమలు: టెట్​ కన్వీనర్​ రాధారెడ్డి


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15న నిర్వహించే తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీఎస్​ టెట్)కు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షకు 2,91,058 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొందరు రెండు పేపర్లూ రాయనున్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరుగనుంది. 

పేపర్ 1 ఎగ్జామ్​కు రాష్ట్రవ్యాప్తంగా 1,139 సెంటర్లను ఏర్పాటు చేయగా, వాటిల్లో 2,69,557 మంది పరీక్ష రాయనున్నారు. పేపర్​ 2 ఎగ్జామ్​కు 913 సెంటర్లను సిద్ధం చేయగా, 2,08,498 మంది హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 2,052 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, మరో 2,052 మంది డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లను నియమించారు. 

వీరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 22,572 మంది ఇన్విజిలేటర్లను, 10,260 మంది హాల్ సూపరింటెండెంట్లను ఏర్పాటు చేశారు. టెట్ పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లు, కాలేజీలకు గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం వరకు సెలవులు ప్రకటించారు. 

ALSO READ: తాళం వేసిన ఫ్లాట్లలో .. 8 నిమిషాల్లోనే చోరీ చేస్తరు!

నిమిషం నిబంధన అమలు
టెట్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని, నిర్ణీత టైమ్​కు దాటితే పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు గంటముందే సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నదని తెలిపారు.