
ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు, రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. సీఎం కేసీఆర్‌కు, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారం నుంచి నిరాహార దీక్షకు దిగిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిమ్స్‌లో దీక్షను కొనసాగిస్తున్నారు. గురువారం రాష్ట్ర బంద్‌కు ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ప్రగతిభవన్ ముట్టడికి బీజేపీ యువమోర్చ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. ముందస్తుగా అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పలుమార్లు బీజేవైఎం కార్యకర్తలు ప్రగతి భవన్‌వైపు దూసుకురావడంతో వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. కొందరు నిరసనకారులు అక్కడి బారికేడ్లను దాటుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ నాయుడు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వినయ్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భానుప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం వల్ల అధికారంలోకి వచ్చిన కేసీఆర్ స్టూడెంట్స్‌ను విస్మరిస్తున్నారని ఆరోపించారు.
ఎక్కడికక్కడ నిర్బంధాలు.. అరెస్టులు….
రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, బీజేవైఎం నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కలెక్టరేట్లను ముట్టడించారు. వారిని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ నేత, ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్‌చందర్జీని హౌస్ అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద నిరసన తెలపడానికి వచ్చిన ఎమ్మెల్సీ రామచంద్రరావును అరెస్ట్ చేశారు. అక్కడే అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో బీజేపీ నేతలు నిరసన ర్యాలీలు చేపట్టారు. కరీంనగర్‌లో నేతలు బండి సంజయ్, బాస సత్యనారాయణరావు తదితరులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేట్టారు. వరంగల్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో హన్మకొండ హంటర్‌రోడ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి సుబేదారీలోని కలెక్టరేట్‌కు ర్యాలీ చేపట్టారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.
ఎమెర్జెన్సీని తలపిస్తోంది: దత్తాత్రేయ
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం రాష్ట్ర బంద్ చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వ్యవహారం ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. రాష్ట్ర పరిస్థితులను కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.