- రూ.500 బోనస్‌తో భారీగా పెరిగిన సన్నాల సాగు
- పోయినేడు 25.05 లక్షల ఎకరాలు.. ఈసారి 40.44 లక్షల ఎకరాలు
- ఇప్పటిదాకా సన్నాలు, దొడ్డు వడ్లు కలిపి 10.80 లక్షల
- టన్నులు కొన్న ప్రభుత్వం రైతులకు ఇప్పటిదాకా రూ.622 కోట్లు చెల్లింపు..
- బోనస్ కింద రూ.115 కోట్లు పోయినేడు ఈ టైం వరకు 9.35 లక్షల టన్నులు కొనుగోలు చేసిన గత సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సన్న రకాలకు సర్కార్ ప్రోత్సాహం కల్పించడంతో మార్కెట్లోకి సన్న ధాన్యం పోటెత్తుతున్నది. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు కనీస మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సన్నాల సాగు భారీగా పెరిగి పుట్ల కొద్దీ పంట మార్కెట్‌కు వస్తున్నది. వడ్ల కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7,500 సెంటర్లు ఏర్పాటు చేసిన సర్కార్.. శుక్రవారం నాటికి లక్షన్నర మంది రైతుల నుంచి మొత్తం 10.80 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసింది. ఇందులో 2.30 లక్షల టన్నుల సన్న వడ్లు ఉండగా, 8.50 లక్షల టన్నుల దొడ్డు వడ్లు ఉన్నాయి. వడ్లు అమ్మిన రైతులకు ప్రభుత్వం వెంటవెంటనే చెల్లింపులు చేస్తున్నది. ఇప్పటి వరకు రూ.622 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇందులో సన్న వడ్లకు బోనస్ రూపంలో రూ.115 కోట్ల దాకా రైతులకు అందించింది.జనవరి నుంచి రేషన్లోసన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్న సర్కార్.. సన్న వడ్ల సేకరణను వేగవంతం చేసింది.
సన్నొడ్ల దిగుబడి అంచనా 93.33 లక్షల టన్నులు..
గత రికార్డులను తిరగరాస్తూ ఈ వానాకాలం సీజన్లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గతానికి భిన్నంగా దొడ్డు వడ్ల సాగు తగ్గి, సన్న వడ్ల సాగు భారీగా పెరిగింది. సన్నాలకు సర్కార్ రూ.500 బోనస్ ప్రకటించడంతో వీటి సాగు గతంతో పోలిస్తే ఏకంగా 61 శాతం పెరిగింది. పోయినేడు వానాకాలంలో వరి సాగు విస్తీర్ణంలో సన్నాల వాటా 25.05 లక్షల ఎకరాలు (38 శాతం) ఉంటే.. ఈసారి అది 40.44 లక్షల ఎకరాలకు (61 శాతం) పెరిగింది. ఇక పోయినేడు వానాకాలంలో 40.89 లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్లు సాగైతే, ఈసారి అది 26.33 లక్షల ఎకరాలకు తగ్గింది. సాగు గణనీయంగా పెరగడంతో దిగుబడిలోనూ సన్న ధాన్యం రికార్డులు సృష్టిస్తున్నది. ఈ యేడు సన్న వడ్ల దిగుబడి దాదాపు 93.33 లక్షల టన్నులు ఉంటుందని వ్యవసా య శాఖ అంచనా వేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పుడు ఏ మిల్లు చూసినా, ఏ కొనుగోలు సెంటర్ చూసినా సన్న వడ్ల రాసులే కనిపిస్తున్నాయి.
కొనుగోళ్ల లక్ష్యం 80 లక్షల టన్నులు..
పోయినేడు వానాకాలం సీజన్లో 65.94 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇప్పుడది 66.77 లక్షల ఎకరాలకు పెరిగింది. నిరుడు వానాకాలంలో ధాన్యం దిగుబడి అంచనా 1.46 కోట్ల టన్నులు కాగా, ఈసారి అది 1.53 కోట్ల టన్నులుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అంతేకాదు ఇందులో 61 శాతం అంటే 93.33 లక్షల టన్నులు సన్నాల దిగుబడే ఉంటుందని లెక్కగట్టింది. అయితే వానాకాలం పంటలో రైతులు తమ అవసరాలు, విత్తనాలకు ఉంచుకోగా, ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు పోగా దాదాపు 80 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు సెంటర్లకు వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
గతంతో పోలిస్తే ఎక్కువే కొనుగోళ్లు..
వడ్ల కొనుగోళ్లకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 7,500 సెంటర్లు ఏర్పాటు చేసింది. అక్టోబర్ మొదటి వారం నుంచే కొనుగోళ్లు ప్రారంభించింది. మొదట్లో బహి రంగ మార్కెట్లో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఉండడంతో బయట వ్యాపారులకు అమ్ముకునేందుకే రైతులు మొగ్గు చూపారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రద్దీ గతంతో పోలిస్తే తగ్గింది. అయితే, రైతులను మిల్లర్లు, వ్యాపారులు ఇబ్బందులు పెడ్తే ఎస్మా ప్రయోగించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశించారు. దీంతో ఈ నెల మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. పోయినేడాది ఇదే సమయానికి 9.35 లక్షల టన్నుల కొనుగోళ్లు జరగ్గా, ఈసారి 10.80 లక్షల టన్నుల కొనుగోళ్లు జరిగాయి. అంటే గతంతో పోలిస్తే దాదాపు లక్షన్నర టన్నులు ఎక్కువగానే ఉండడంతో ఈసారి కొనుగోళ్లు మెరుగ్గానే ఉన్నట్లు స్పష్టమవుతున్నది.