
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచం పూర్తిగా మారిపోయే పరిస్థితులు వచ్చాయి. దీన్ని చూసి అంతా వాహ్వా.. అనుకున్నారు. ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో అని ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది. ఇప్పుడు మరో కొత్త ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేయక మానదు. స్వీడన్ సైంటిస్టులు చేసిన ఆవిష్కరణ ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారుతోంది.
స్వీడన్ సైంటిస్టులు టూత్ పేస్ట్ టెక్స్చర్ లో ఉండే బ్యాటరీని కనుగొన్నారు. ఈ బ్యాటరీ నచ్చిన షేప్ లోకి మార్చుకునేలా ఉంటుంది. నెక్స్ట్ జెనరేషన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మెడికల్ డివైజెస్, రోబోట్స్ తయారు చేయడానికి ఈ బ్యాటరీలు ఎంతగానో ఉపకరిస్తాయి.
ఇప్పటికే స్ట్రెచబుల్ బ్యాటరీల తయారీ కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇవి రబ్బర్ కాంపోజిట్ మెటీరియల్స్ నుంచి తయారు చేస్తున్నారు. అయితే వీటికి బలమైన ఎలక్ట్రోడ్స్ అవసరం ఉండటంతో ఆశించినంత మేర ఫలితాలు ఇవ్వలేకపోయాయి.
లింకోపింగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ సమస్యను అధిగమించి కొత్త సొల్యుషన్ కనుగొన్నారు. పేపర్ ప్రొడక్ట్స్ కు సంబంధించిన బై ప్రొడక్ట్స్ నుంచి తయారు చేసిన లిగ్నిన్, అదేవిధంగా కండక్టివ్ ప్లాస్టిక్స్ ను ఉపయోగించి ఈ కొత్త టూత్ పేస్ట్ లాంటి బ్యాటరీలను తయారు చేశారు. ఇది ధృఢత్వంలా కాకుండా ఎలా అంటే అలా షేప్ మారేలా ఉంటుదని సైంటిస్టులు తెలిపారు.
‘‘ఈ బ్యాటరీ టెక్స్చర్ టూత్ పేస్ట్ లా ఉంటుంది. దీనిని ఉపయోగించి రాబోయే తరం ఉత్పత్తులను, గ్యాడ్జెట్స్ షేప్ ను నచ్చిన విధంగా మార్చుకోవచ్చు.’’ అని ఈ ప్రాజెక్టు కో ఆథర్ ఐమన్ రహ్మానుద్దీన్ చెప్పారు.
అయితే ఈ బ్యాటరీ మెటీరియల్స్ కాంజుగేటెడ్ పాలిమర్స్ (సంయోగం చెందిన రాసాయన పదార్థాలు), లిగ్నిన్స్ అయినందున.. ముడిపదార్థాలకు కొదవ ఉండదని ఈ సందర్భంగా తెలిపారు. వీళ్లు తయారు చేసిన ప్రోటోటైప్ (పరీక్షించేందుకు రెడీగా ఉన్న ప్రొడక్ట్) బ్యాటరీని 500 సార్లు రీచార్జ్ చేసినా, డిస్ చార్జ్ చేసినా.. దాని పర్ఫామెన్స్ లో ఎలాంటి తేడా రాలేదని చెబుతున్నారు. నెక్ట్స్ జెనరేషన్ డివైజెస్ తయారు చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
అయితే ప్రస్తుతం ఇది పారిశ్రామికంగా వినియోగించేందుకు ఇంకా సిద్ధం కాలేదని తెలిపారు. కేవలం 1 ఓల్ట్ ఛార్జింగ్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సాధారణ బ్యాటరీలతో పోల్చితే ఇది 8 శాతం తక్కువ. త్వరలో మరింత స్టోరేజ్ చేసేలా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.