ఇండియాలో టాప్-10 రిచ్చెస్ట్ ఎమ్మెల్యేలు వీళ్లే.. టాప్ ప్లేస్ ఎవరిదంటే..

ఇండియాలో టాప్-10 రిచ్చెస్ట్ ఎమ్మెల్యేలు వీళ్లే.. టాప్ ప్లేస్ ఎవరిదంటే..

న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రజాప్రతినిధుల గురించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఆసక్తికర వివరాలను బయటపెట్టింది. ఇండియాలో కోట్లకు పడగలెత్తిన టాప్-10 రిచ్చెస్ట్ ఎమ్మెల్యేల డేటాను ADR ప్రకటించింది. ఈ జాబితాలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా 3 వేల 383 కోట్ల ఆస్తిపాస్తులతో టాప్ ప్లేస్లో ఉన్నారు. పరాగ్ షా మహారాష్ట్రలోని ఘట్కోపర్ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండో స్థానంలో కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత, ట్రబుల్ షూటర్గా పేరొందిన కర్ణాటక మంత్రి, కనకపుర ఎమ్మెల్యే డీకే శివకుమార్ నిలిచారు.

డీకే శివకుమార్ ఆస్తి 14 వందల 13 కోట్లుగా ఏడీఆర్ వెల్లడించింది. మూడో స్థానంలో కూడా కర్ణాటక ఎమ్మెల్యేనే ఉన్నారు. కర్ణాటకలోని గౌరిబిదనూరు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన కేహెచ్ పుట్టస్వామి గౌడ 12 వందల 67 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. నాలుగో స్థానం కూడా కర్ణాటక ఎమ్మెల్యేకే దక్కింది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియకృష్ణ 11 వందల 56 కోట్లతో 4వ స్థానంలో నిలిచారు.

Also Read : దేశంలో సగం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు

వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు నిలిచారు. ఏపీ ముఖ్యమంత్రి, కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయడు 9 వందల 31 కోట్ల ఆస్తులతో ఐదో స్థానంలో నిలవగా, ఏపీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ 8 వందల 24 కోట్ల ఆస్తితో ఆరో స్థానంలో ఉన్నారు. ఇండియాలోని టాప్ టెన్ రిచ్చెస్ట్ ఎమ్మెల్యేల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఏడో స్థానంలో ఉన్నారు.

ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం.. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తి 7 వందల 57 కోట్లు. నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 7 వందల 16 కోట్లతో 8వ స్థానంలో నిలిచారు. 9వ స్థానంలో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే జయంతిభాయ్ సోమాభాయ్ పటేల్ 6 వందల 61 కోట్లతో ఉండగా, టాప్ 10లో చివరి స్థానంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేషా బీఎస్ 6 వందల 48 కోట్లతో నిలిచారు. రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఈ టాప్ టెన్ రిచ్చెస్ట్ ఎమ్మెల్యేల జాబితాలో నలుగురు ఆంధ్రా ఎమ్మెల్యేలు, నలుగురు కర్ణాటక ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. మిగిలిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు మహారాష్ట్ర, మరొకరు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు కావడం గమనార్హం.

ఇండియాలో టాప్-10 ధనిక ఎమ్మెల్యేల జాబితా-2025

1. పరాగ్ షా (బీజేపీ, మహారాష్ట్ర) – రూ. 3,383 కోట్లు
2. డీకే శివకుమార్ (కాంగ్రెస్, కర్ణాటక) – రూ. 1,413 కోట్లు
3. కేహెచ్ పుట్టస్వామి గౌడ (స్వతంత్ర ఎమ్మెల్యే, కర్ణాటక) – రూ.1,267 కోట్లు
4. ప్రియకృష్ణ (కాంగ్రెస్, కర్ణాటక) – రూ.1,156 కోట్లు
5. నారా చంద్రబాబు నాయుడు (టీడీపీ, ఆంధ్రప్రదేశ్) – రూ. 931 కోట్లు
6. పొంగూరు నారాయణ (టీడీపీ, ఆంధ్రప్రదేశ్) – రూ. 824 కోట్లు
7. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (వైఎస్ఆర్ సీపీ, ఆంధ్రప్రదేశ్) – రూ. 757 కోట్లు
8. వేమిరెడ్డి. ప్రశాంతి రెడ్డి (టీడీపీ, ఆంధ్రప్రదేశ్) – రూ. 716 కోట్లు
9. జయంతిభాయ్ సోమాభాయ్ పటేల్ (బీజేపీ, గుజరాత్) – రూ. 661 కోట్లు
10. సురేషా బీఎస్ (కాంగ్రెస్, కర్ణాటక) – రూ. 648 కోట్లు