- ఉద్యోగుల సంఖ్యను 35 శాతం పెంచే చాన్స్
- 9 శాతం పెరగనున్న రెవెన్యూ
న్యూఢిల్లీ:మనదేశంలోని టాప్–3 టెలికం కంపెనీలు భారీగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి ఉద్యోగులను సంఖ్యను 35 శాతం పెంచే అవకాశాలు ఉన్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల సంఖ్యను 25 శాతం పెంచుతాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 5జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించడానికి, 4జీని మరింత పెంచడానికి, మానిటైజేషన్ కోసం వీటికి భారీ ఎత్తున నిపుణులు అవసరం. ఈ మూడు కంపెనీల్లో నియామకాలు మొదలయ్యాయని, 2022 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇవి పెద్దగా జాబ్స్‌ను ఇవ్వలేదని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. డిజిటైజేషన్,5జీ కారణంగా టెల్కోలకు పెద్ద ఎత్తున నిపుణుల అవసరం ఏర్పడిందని స్టాఫింగ్ ఫర్మ్ ఫౌండింగ్(ఇది వరకు మాన్స్టర్) సీఈఓ శేఖర్ గరిసా అన్నారు. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ టెల్కోలలో మొత్తం ఉద్యోగుల సంఖ్య సంవత్సరానికి దాదాపు 35శాతం పెరిగి 1,75,000కి చేరుకున్నట్టు వాటి యాన్యువల్ రిపోర్టులు చెబుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి జియో మొత్తం ఉద్యోగుల సంఖ్య 95,326 కాగా, ఎయిర్‌టెల్‌లో 64,407 వోడాఫోన్ ఐడియాలో 15,604 మంది పనిచేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో టెల్కోలు తమ ఉద్యోగుల సంఖ్యను నాలుగో వంతు పెంచుకోవచ్చని టెలికంరంగ నిపుణులు అంటున్నారు. నెట్‌వర్క్ ఇంజనీర్లు, నెట్‌వర్క్ ఆర్కిటెక్ట్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులు, డేటా సైంటిస్టులు, డేటా అనలిస్ట్‌లు సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌లు వంటి ప్రొఫైల్‌ల కోసం టెల్కోలు వెతుకుతున్నాయి. "ఐఓటీ/ఐఐఓటీ, నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్‌వర్క్ అప్‌గ్రేడేషన్, నెట్‌వర్క్ మైగ్రేషన్ నెట్‌వర్క్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీ నిపుణులకు చాలా డిమాండ్ ఉంది. ఈ డొమైన్‌లలోని చాలా ప్రొఫైల్‌ల పే ప్యాకేజీలు కూడా ఎక్కువగా ఉన్నాయి" అని ఎన్ఎల్బీ సర్వీసెస్‌కు చెందిన సచిన్ చెప్పారు.
పెరిగిన కాంట్రాక్టు నియామకాలు
2023 ఆర్థిక సంవత్సరంలో వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ వంటి టెల్కోల ద్వారా కాంట్రాక్టు నియామకాలు కూడా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌టెల్ కాంట్రాక్టు కార్మికుల నియామకం 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 26,613 నుంచి 50,699 మందికి పెరిగిందని సెబీ వెల్లడించింది. వొడాఫోన్‌ఐడియాలో ఈ సంఖ్య 1,771 నుంచి 6,234లకు అంటే...2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3.5 రెట్లు పెరిగింది. వోడాఫోన్ ఐడియాలో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు తక్కువ ఉన్నాయని, కంపెనీ పొదుపుకు ప్రాధాన్యం ఇస్తోందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. వొడాఫోన్ ఐడియా చందాదారుల సంఖ్య వేగంగా తగ్గిపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. జియో మాత్రం కాంట్రాక్టు జాబ్స్ సంబంధించిన డేటాను వెల్లడించలేదు. ఈ విషయమై అడిగిన ప్రశ్నలకు ఈ మూడు కంపెనీలూ స్పందించలేదు. 2024 ఆర్థిక సంవత్సరంలో నెట్‌వర్క్ విస్తరణ, 5జీ మానిటైజేషన్, రిటైల్ యాక్టివేషన్‌లపై టెల్కోలు దృష్టి సారించినందున కాంట్రాక్టు నియామకాల ఊపు కొనసాగుతుందని భావిస్తున్నారు.
టెంపరరీ పొజిషన్‌లలో 100శాతం పెరుగుదల ఉండొచ్చని టీమ్‌లీజ్‌లో స్టాఫింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కార్తీక్ నారాయణ్ చెప్పారు. ఇన్-డిమాండ్ ప్రొఫైల్‌లలో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్‌లు, స్టోర్ ప్రమోటర్లు, ఎస్ఎంఈ, సోహో ఎంటర్‌ప్రైజ్ వ్యాపారం కోసం సేల్స్ మేనేజర్ల వంటి ఉద్యోగాలు ఉన్నాయి. అయితే నెట్‌వర్క్ సైడ్ ఇన్‌స్టాలేషన్ రిపేర్ ఇంజనీర్, సర్వైలెన్స్ ఇంజనీర్, ఫీల్డ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ వైర్‌మ్యాన్ ప్రొఫైల్‌ల కోసం వేగంగా నియామకాలు జరుగుతున్నాయి. జియోను 2022 ఆర్థిక సంవత్సరంలో 28,473 మంది విడిచిపెట్టగా, 2023లో 41,818 మంది వెళ్లిపోయారు. ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ఉద్యోగుల రాజీనామాల వివరాలను బయటపెట్టలేదు. ఎయిర్‌టెల్ ఎంప్లాయీ టర్నోవర్ నిష్పత్తి 2023 ఆర్థిక సంవత్సరంలో 24శాతం (2022 ఆర్థిక సంవత్సరంలో 30శాతం) కాగా, వొడాఫోన్ ఐడియాకి ఇది 23.9శాతం (2022 ఆర్థిక సంవత్సరంలో 26.1శాతంతో పోలిస్తే) ఉంది. జియోలో కొత్త నియామకాల సంఖ్య 70, 418 (2022 ఆర్థిక సంవత్సరంలో 57, 883) కాగా, ఎయిర్‌టెల్‌కి 2022 ఆర్థిక సంవత్సరంలో 4862 నుంచి 2023 ఆర్థిక సంవత్సరంలో 7,248 మంది ఉద్యోగులకు పెరిగింది. టెల్కోల రెవెన్యూ కూడా ఈ ఏడాది తొమ్మిది శాతం పెరుగుతుందని ఇక్రా రిపోర్టు వెల్లడించింది.