క్రికెట్.. బ్యాట్, బంతి మధ్య జరిగే సమరమే ఈ ఆట. మొదట ఈ క్రీడను వినోదం కోసం ఆడినా.. తరాలు మారే కొద్దీ క్రికెట్ ప్రపంచంలోనే విలువైన ఆటగా మారిపోయింది. ప్రస్తుతం సుమారుగా 100 కు పైగా దేశాల్లో క్రికెట్ ఆడుతున్నారు. ఈ ఆటలో బౌలర్లు బంతితో మాయచేస్తే.. బ్యాటర్లు తమ వినూత్న షాట్లతో అలరించారు. అలాంటి వినూత్న షాట్లలో కొన్ని బాగా ఫేమస్ అయ్యాయి. అవేంటి..? వాటిని అభిమానులకు పరిచయం చేసిన ఆటగాడు ఎవరనేది చూద్దాం..
అప్పర్ కట్
భారత అభిమానులకు, క్రికెట్ రారాజు సచిన్ టెండూల్కర్ ఆటను ఇష్టపడే వారికి ఈ షాట్ బాగా సుపరిచితమే. బహుశా ఈ షాట్‌ను బాగా ఆడిన ఆటగాళ్లలో ఒకరు, ఈ క్రికెట్ షాట్‌ను పరిచయం చేసిన మొదటి ఆటగాడు సచిన్. బంతి బ్యాటర్ తలమీదుగా వెళ్లే సమయంలో థర్డ్ మ్యాన్ వైపు లేదా కీపర్ మీదుగా ఆడటమే ఈ అప్పర్ కట్ స్పెషాలిటీ. కట్ షాట్‌లో స్వల్ప మార్పులు చేసి సచిన్ ఈ షాట్‌ను పరిచయం చేశారు.
పాడిల్ స్కూప్
పాడిల్ స్కూప్ అనేది మరొక వినూత్న క్రికెట్ షాట్. ఈ ఈ షాట్‌ను పరిచయం చేసింది.. డగ్లస్ మారిల్లియర్(Douglas Marillier). జింబాబ్వే మిడిల్ ఆర్డర్ బ్యాటరైన డగ్లస్ ఆంథోనీ మారిల్లియర్.. ఆస్ట్రేలియాతో జరిగిన ఓ మ్యాచ్‌లో పాడిల్ స్కూప్ ఆడాడు. అక్కడి నుంచి కీపర్ వెనుక పరుగులు రాబట్టడంలో అందరూ ఈ షాట్ ఆడేస్తున్నారు.
దిల్ స్కూప్
శ్రీలంక మాజీ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ కనిపెట్టిన స్కూప్ యొక్క మరొక రూపమే.. దిల్ స్కూప్. ఈ షాట్‌ను దిల్షాన్ చాలా చక్కగా ఆడతాడు. మోకాళ్లను నేలకు ఆనించి.. బంతిని వికెట్ కీపర్ మీదుగా తరలించడమే ఈ షాట్ ప్రత్యేకత. గుడ్ లెంగ్త్ డెలివరీలను ఎదుర్కోవడానికి దిల్ స్కూప్ మంచి అస్త్రం.
రివర్స్ స్కూప్
రివర్స్ స్కూప్ అచ్చం పాడిల్ స్కూప్ లాగా ఉంటుంది. కాకపోతే బ్యాటర్ తన బ్యాటింగ్ శైలిని మార్చి వ్యతిరేక దిశలో బంతిని తరలిస్తాడు. ఫీల్డర్ థర్డ్ మ్యాన్ సర్కిల్ లోపల ఉండి, బౌలర్ మిడిల్ స్టంప్ చుట్టూ బంతులు వేస్తూ ఇబ్బంది పెట్టే సమయంలో ఈ షాట్ ఆడుతుంటారు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్, ప్రస్తుత ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ షాట్‌కు సుపరిచితులు.
హెలికాప్టర్ షాట్
పదునైన యార్కర్-లెంగ్త్ డెలివరీలను ఎదుర్కోవడానికి ఉన్న బ్యాటర్లకు ఉన్న ఏకైక అస్త్రం.. హెలికాప్టర్ షాట్. ఫాస్ట్ బౌలర్ల యార్కర్-లెంగ్త్ డెలివరీలను ఆడటం బ్యాటర్లకు ఎప్పుడూ సవాలే. వాటిని ఈ షాట్ తో ధీటుగా ఎదుర్కోవచ్చు. భారత మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని దీనిని పరిచయం చేశాడు. ఈ షాట్ ఆడటం అందరికీ సాధ్యం కాదు. అడపా దడపా హెలికాప్టర్ షాట్లు కనిపిస్తుంటాయి.