స్టాక్ మార్కెట్ చరిత్రలో 5 అతిపెద్ద పతనాలు.. హర్షద్ మెహతా స్కామ్ నుంచి కరోనా వరకు..

స్టాక్ మార్కెట్ చరిత్రలో 5 అతిపెద్ద పతనాలు.. హర్షద్ మెహతా స్కామ్ నుంచి కరోనా వరకు..

Stock Market Crashes: భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పతనం నమోదు కావటం కొత్తేమీ కాదు. దేశీయ స్టాక్ మార్కెట్ల గత చరిత్రను పరిశీలిస్తే దాదాపు 5 సార్లు భారీగా పతనంతో ఇన్వెస్టర్ల సంపదను కోల్పోయారు. నేడు మార్కెట్లు గడచిన 12 నెలల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలకు పతనం అయ్యాయి. మధ్యాహ్నం 1 గంటల సమయంలో సెన్సెక్స్ 3వేల220 పాయింట్ల నష్టంలో ఉండగా.. నిఫ్టీ సూచీ వెయ్యి 033 పాయింట్లను కోల్పోవటంతో ఇన్వెస్టర్లు దాదాపు 17 లక్షల కోట్ల మేర సంపదను కోల్పోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో విక్స్ సూచీ 67 శాతం పెరుగుదలో ఇన్వెస్టర్లకు చెమటలు పట్టిస్తోంది.

భారత స్టాక్ మార్కెట్లలో పెద్ద కుదుపును కలిగించిన 5 భారీ పతనాల వివరాలను పరిశీలిస్తే హర్షద్ మెహతా స్కామ్ నుంచి నేటి సెన్సెక్స్ పతనం వరకు ఇన్వెస్టర్లను ఎలా దెబ్బతీశాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1. Harshad Mehta Scam Crash (1992): హర్షద్ మెహతా స్కామ్ గురించి భారత స్కాక్ మార్కెట్లలో తెలియని వారు ఉండరు. 1992లో మార్కెట్లను హర్షద్ ఎలా తారుమారు చేస్తున్నారనే వివరాలు బయటకు రావటంతో మార్కెట్లు కుప్పకూలాయి. ఏప్రిల్ 28, 1992న సెన్సెక్స్ సూచీ 570 పాయింట్లను ఒక్కరోజులో కోల్పోవటంతో భారతీయ స్టాక్ మార్కెట్లోని పెట్టుబడిదారుల సంపద రూ.4వేల కోట్లు ఆవిరైంది.

2. Ketan Parekh Scam Crash (2001): ఇక మార్కెట్లను 2001లో కేతన్ పరీక్ స్కామ్ మరోసారి కుదేలు చేసింది. స్టాక్ బ్రోకర్ చేసిన మోసం బయటకు రావటంతో పాటు డాట్ కామ్ బబుల్ పేలటంతో సెన్సెక్స్ 176 పాయింట్లు కోల్పోయింది. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు కూడా మార్కెట్లలో అమ్మకాలను ప్రేరేపించాయి. 

3. Election Shock Crash (2004): 2004లో రాజకీయాల్లో వచ్చిన మార్పులు కూడా మార్కెట్లను పతనానికి గురిచేశాయి. ఆ సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యూపీఐ ప్రభుత్వం అనూహ్యంగా గెలుపొందటంతో ఆర్థిక సంస్కరణలపై పెట్టుబడిదారుల ఆందోళనలు మార్కెట్ల పతనానికి దారితీశాయి. దీంతో ఒక్కరోజులోనే సెన్సెక్స్ సూచీ 11 శాతానికి పైగా నష్టాల్లోకి జారుకుంది. ఆ రోజు అమ్మకాల ఒత్తిడి కారణంగా రెండు సార్లు మార్కెట్లలో ట్రేడింగ్ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడటం అత్యంత భయానక పరిస్థితులను కలిగించింది.

4. Global Financial Crisis Crash (2008): 2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యంతో భారత మార్కెట్లు కుప్పకూలాయి. ఆ సమయంలో అమెరికాలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న లిమన్ బ్రదర్స్ కుప్పకూలటం పెద్ద ప్రకంపనలకు దారితీసింది. జనవరి 21, 2008న సెన్సెక్స్ 14వందల పాయింట్లకు పైగా పతనం కాగా, తర్వాత నెల రోజుల పాటు సెన్సెక్స్ దాని గరిష్ఠాల నుంచి 60 శాతం కుప్పకూలింది. మార్కెట్లలో బేర్స్ పంజాతో పాటు అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను ఆ సమయంలో చిత్తు చేశాయి. 

5. COVID-19 Pandemic Crash (2020): ఇక చివరిగా దేశీయ స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీసిన ట్రిగర్ కరోనా మహమ్మారి. పాండమిక్ సమయంలో సెన్సెక్స్ సూచీ మార్చి 23, 2020న 13 శాతానికి పైగా పతనమై 4వేల పాయింట్ల వరకు పతనాన్ని చూసింది. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించటంతో మెుదలైన భయాలు మార్కెట్లలో విపరీతమైన అమ్మకాలను ప్రేరేపించాయి. పెద్ద ఇన్వెస్టర్ల నుంచి రిటైల్ పెట్టుబడిదారుల వరకు అందరూ నష్టాల మార్కెట్లలో తమ వాటాలను విక్రయించుకున్నారు.