
మరో మూడు రోజుల్లో శివరాత్రి రాబోతుంది. అంటే.. శీతాకాలానికి గుడ్ బై చెప్తూ.. వేసవికి స్వాగతం పలుకుతామన్నమాట. అయితే, ఈ ఏడాది శివరాత్రి కంటే ముందే పెరిగిన ఉష్ణోగ్రతలతో వేసవి వచ్చినట్టే అనిపిస్తోంది. అయినా ఇదంతా ఇప్పుడెందుకు? అంటారా.. శివరాత్రికి ఉపవాసం చేసేవాళ్లు.. ఈసారి సమ్మర్ని తట్టుకోవడానికి రెడీ అవ్వాలనుకునేవాళ్లు.. అందరికీ ఈ రెసిపీలు చాలా బెటర్. తెలంగాణలో సాబుదానా అని పిలిచే సగ్గుబియ్యంతో ఈ వారం స్పెషల్స్.
కిచిడీకి కావాల్సినవి:
సాబుదానా – ఒక కప్పు
నీళ్లు – ముప్పావు కప్పు
పల్లీలు – పావు కప్పు
చక్కెర – ఒక టీస్పూన్
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర – ఒక టీస్పూన్
కరివేపాకు, కొత్తిమీర – కొంచెం
అల్లం తరుగు, నిమ్మరసం – ఒక్కోటి అర టీస్పూన్
పచ్చిమిర్చి – రెండు
ఆలుగడ్డ – ఒకటి
ఉప్పు – అర టీస్పూన్
తయారీ:
ఒక గిన్నెలో సాబుదానా వేసి నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి, మూతపెట్టి ఆరుగంటలు నానబెట్టాలి. ఈ కొలతల్లో తీసుకుంటే సగ్గుబియ్యం అతుక్కుపోకుండా ఉంటాయి. పాన్లో పల్లీలు వేసి వాటిని నూనె లేకుండా వేగించాలి. తర్వాత మిక్సీజార్లో వేసి పలుకులుగా గ్రైండ్ చేయాలి. సాబుదానా ఉన్న గిన్నెలో పల్లీల పొడి, చక్కెర, ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచాలి. పాన్లో నెయ్యి వేడి చేసి అందులో జీలకర్ర, కరివేపాకు వేసి వేగించాలి. పచ్చిమిర్చి, అల్లం తరుగుతో పాటు ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు కూడా వేయాలి. అవి వేగాక, సాబుదానా మిశ్రమం వేసి కలపాలి. ఐదు నిమిషాల తర్వాత నిమ్మ రసం వేసి, కొత్తిమీర చల్లాలి.
సాగో పనా కావాల్సినవి:
సాబుదానా, పెరుగు – ఒక్కో కప్పు
చక్కెర – రెండు టేబుల్ స్పూన్లు
ద్రాక్ష – కొన్ని
యాపిల్, అరటి, దానిమ్మ – ఒక్కోటి
పచ్చికొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూన్
మిరియాల పొడి – ఒక టీస్పూన్
యాలకుల పొడి – అర టీస్పూన్
జీడిపప్పు, బాదం, చెర్రీ తరుగు – సరిపడా
తయారీ:
సాబుదానా శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి రెండు గంటలు నానబెట్టాలి. ఒక గ్లాసులో నీళ్లు పోసి చక్కెర వేసి కలిపి పక్కన ఉంచాలి. ఒక గిన్నెలో పెరుగు వేసి చక్కెర నీళ్లు పోయాలి. అందులో నానబెట్టిన సాబుదానా, పచ్చికొబ్బరి తురుము, యాపిల్, అరటి, ద్రాక్ష ముక్కలు, దానిమ్మ గింజలు, జీడిపప్పు, బాదం, చెర్రీ తరుగు, మిరియాల పొడి, యాలకుల పొడి వేయాలి. అవన్నీ కలిసేలా బాగా కలపాలి. తర్వాత గ్లాసులో పోసి, నచ్చిన ఇంగ్రెడియెంట్స్తో గార్నిష్ చేసుకుంటే సరి.
రొట్టె తయారీకి కావాల్సినవి:
సాబుదానా పిండి – ఒక కప్పు
పల్లీల పొడి – అర కప్పు
జీలకర్ర – ఒక టీస్పూన్
పచ్చిమిర్చి – మూడు
కొత్తిమీర – కొంచెం
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్
ఆలుగడ్డలు – రెండు
ఉప్పు, నీళ్లు – సరిపడా
తయారీ:
ముందుగా ఆలుగడ్డలు ఉడికించి, తొక్క తీసి, మెదపాలి. సాబుదానాను మిక్సీ పట్టి పిండి చేయాలి. ఆ పిండిని ఒక గిన్నెలో వేసి అందులో పల్లీల పొడి వేసి కలపాలి. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, నెయ్యి, మెదిపిన ఆలుగడ్డ మిశ్రమం, ఉప్పు వేయాలి. అవన్నీ కలిసేలా బాగా కలపాలి. ఆ తర్వాత నీళ్లు పోసి మరోసారి కలపాలి. రొట్టె చేయడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి. ఆపై కొంచెం పిండిని తీసుకుని, చేత్తో రొట్టెలా వత్తాలి. దాన్ని వేడి వేడి పెనం మీద వేసి నెయ్యితో రెండు వైపులా కాల్చాలి. ఈ రొట్టెను చట్నీతో తింటే టేస్టీగా ఉంటుంది.