
న్యూఢిల్లీ: పెట్రో ధరలు ఆకాశాన్నంటుతుండడంతో, బాగా మైలేజ్ ఇచ్చే కారును సొంతం చేసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మనదేశంలో రూ. 5 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువ ధర కలిగిన అనేక కార్లు ఉన్నాయి. వీటివల్ల మన జేబుపై ఎక్కువ భారం ఉండదు. ఇలాంటి కార్లలో మారుతీ సుజుకీ ఆల్టో, మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో, మారుతీ సుజుకీ సెలెరియో, మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్, హ్యుందాయ్ శాంత్రో, టాటా టియాగో పాపులర్. ఈ కార్లు ఎంత మైలేజీ ఇస్తాయో, ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మారుతీ సుజుకీ ఆల్టో
మారుతీ సుజుకీ ఆల్టో ధర రూ. 3,15,000 నుండి ప్రారంభమవుతుంది. ఇందులోని 0.8-లీటర్ పెట్రోల్ ఇంజన్ 48 పీఎస్ పవర్‌ను,69ఎన్ఎం టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. కారు 22.05కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో
మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో ధరలు రూ. 3. 78 లక్షల నుంచి మొదలవుతాయి. ఇది కే10బీ, 1.0 -లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో (68పీఎస్/90ఎన్ఎం) వస్తుంది. ఇందులో 5 -స్పీడ్ మాన్యువల్ / ఏఎంటీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లు ఉన్నాయి. 21.7కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
మారుతీ సుజుకీ సెలెరియో
మారుతీ సుజుకీ సెలెరియో ధరలు రూ. 4.65 లక్షల నుండి మొదలవుతాయి. ఇది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ (68పీఎస్/90ఎన్ఎం)తో వస్తుంది. 5 -స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5 -స్పీడ్ ఏఎంటీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ఉంటుంది. మైలేజ్ 21.63 కిలోమీటర్లు.
మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్
మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ ధర రూ.4,93,000 (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతాయి. వ్యాగన్ఆర్ కూడా కే10బీ, 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో (68పీఎస్/90ఎన్ఎం) వస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5-స్పీడ్ ఏఎంటీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంటాయి. ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ 21.79 కిలోమీటర్లు.
హ్యుందాయ్ శాంత్రో
హ్యుందాయ్ శాంత్రో ధరలు రూ.4,76,690 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి స్టార్టవుతాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ కారుకు 1.1-లీటర్ ఎప్సిలాన్ ఎంపీఐ పెట్రోల్ ఇంజన్ (69పీఎస్/99ఎన్ఎం) ఉంటుంది. మిగతా బడ్జెట్ కార్ల మాదిరే 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5-స్పీడ్ ఏఎంటీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఇది 20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ఏఆర్ఏఐ- సర్టిఫై చేసింది.
టాటా టియగో
టాటా టియగో ధరలు రూ. ఐదు లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మొదలవుతాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ కారుకు 1.2-లీటర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌ను (86పీఎస్/113ఎన్ఎం) అమర్చారు. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5-స్పీడ్ ఏఎంటీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉంటాయి. ఈ కారు 19.8కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.