లోకల్​ లీడర్లకు బంపర్​ ఆఫర్లు .. కష్టపడ్డ వాళ్లకే పదవులు

  • మెజార్టీ సాధిస్తే స్థానిక ఎన్నికల ఖర్చు ఫ్రీ 
  • మంత్రి కోమటిరెడ్డి హామీతో కాంగ్రెస్​కేడర్​లో జోష్​
  • పార్టీ గెలుపు కోసం పోటాపోటీ ప్రచారం 

నల్గొండ, వెలుగు : పార్లమెంట్​ఎన్నికల్లో కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థులను గెలిపించేందుకు లోకల్​ లీడర్లకు అగ్ర నాయకులు బంపర్​ ఆపర్లు ప్రకటిస్తున్నారు. నల్గొండ, భువనగిరి స్థానాల్లో దేశంలోనే భారీ మెజార్టీ సాధిస్తామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్​కుమార్ రెడ్డి, భువనగిరి ఇన్​చార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిలు శపథం చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ ఎన్నికల్లో కష్టపడ్డ వారికే స్థానిక పదవుల్లో ప్రియార్టీ ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చేసిన ప్రకటన పార్టీలో చర్చకు దారి తీసింది.

గ్రామ, మండల, పట్టణ స్థాయిలో ఎవరైతే ఎక్కువ మెజార్టీ సాధిస్తారో వాళ్లకే జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ పదవుల్లో మొదటి ప్రాధాన్యత దక్కుతుందని, వాళ్ల ఎన్నికల ఖర్చు కూడా తానే భరిస్తా నని మంత్రి కోమటిరెడ్డి చేసిన ప్రకటన పొలిటికల్​సర్కిల్​లో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రి హామీతో పార్టీలో జోష్​కనిస్తోంది. కాంగ్రెస్​అభ్యర్థుల గెలుపు కోసం​పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు. 

ఆశావహులకు అగ్ని పరీక్ష..

పార్లమెంట్​ఎన్నికలు ముగియగానే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్ని కలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో కసరత్తు కూడా మొదలైంది. అయితే, గత ప్రభుత్వం రెండు టర్మ్​ల వరకు ఒకటే రిజర్వేషన్లు ఉండేలా చట్టం తీసుకొచ్చింది. కొత్త చట్టం ప్రకారం రెండో టర్మ్​ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి.

 ఇప్పుడున్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయనే ఆశతో బీఆర్ఎస్​నుంచి అనేక మంది కాంగ్రెస్​లోకి వలస వచ్చారు. వలసొచ్చిన వాళ్లలో కాంగ్రెస్​మాజీ ప్రజాప్రతినిధులతోపాటు బీఆర్ఎస్ లీడర్లూ ఉన్నారు. కాంగ్రెస్​లో చేరితే తమ పదవులకు ఢోకా ఉండదని భావిస్తున్న ఆశావహులకు తాజాగా మంత్రి కోమటిరెడ్డి చేసిన ప్రకటన డైలామాలో పడేసింది. ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు బూత్​స్థాయిలో శ్రమిస్తుండగా, జడ్పీ చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీ లాంటి పదవులు ఆశిస్తున్న లీడర్లు మరింత కష్టపడక తప్పదు. 

మాటపై నిలబడ్డ మంత్రి కోమటిరెడ్డి..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్గొండ మున్సిపల్​చైర్మన్​కాం గ్రెస్​వశమైంది. అంతేగాక గత రెండు టర్మ్​ల నుంచి చైర్మన్ పదవి ఆశించిన మంత్రి కోమటిరెడ్డి సన్నిహితుడు బుర్రి శ్రీనివాస్​రెడ్డి చైర్మన్​గా ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డికి ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్ర స్థాయిలో పదవి దక్కుతుందని బహిరంగ సభలో ప్రకటించారు. 

దీంతో మోహన్​రెడ్డి కార్పొరేషన్​పదవి వస్తదనే ప్రచారం జరుగుతోంది. భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి ఉన్న ఐదేండ్లు నల్గొండ నియోజకవర్గంలో పార్టీ భారాన్ని మోహన్​రెడ్డి మోశాడని, దీంతో ఆయనకు రాష్ట్ర స్థాయి పదవి ఖాయమని మంత్రి తెలిపారు. ఇక తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి జడ్పీ చైర్మన్ పదవిపై ఆశ పెట్టుకున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్​జిల్లా వర్కింగ్​ ప్రెసిడెంట్​గా పనిచేసిన రాంరెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరారు. నల్గొండ మున్సిపల్​వైస్​చైర్మన్​ అబ్బగో ని రమేశ్​గౌడ్​నుడా చైర్మన్​పదవి ఇస్తారనే చర్చ జరుగుతోంది.