- నేడు కొత్తగూడెం రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా
- రేపు రోడ్‌షో నిర్వహించనున్న బీఆర్ఎస్అధినేత కేసీఆర్
- ఇప్పటికే కాంగ్రెస్ బడా లీడర్ల పర్యటన కంప్లీట్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఖమ్మం లోక్‌సభ పరిధిలోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంపై పొలిటికల్ పార్టీల అగ్ర నేతలు గురిపెట్టారు. కొత్తగూడెం నియోజకవర్గంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీఆర్ఎస్అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ రామసహాయం రాఘురాంరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇప్పటికే కొత్తగూడెంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఆయా పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపేందుకు అగ్ర నేతల పర్యటనలు ఎంతగానో దోహదపడుతాయని పలువురు పొలిటికల్ లీడర్లు పేర్కొంటున్నారు.
నేడు జేపీ నడ్డా రాక.. సభకు భారీ ఏర్పాట్లు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం ఖమ్మం లోక్‌సభ పరిధిలోని కొత్తగూడెం అసెంబ్లీ సిగ్మెంట్లో పర్యటించనున్నారు. ఖమ్మం బీజేపీ క్యాండిడేట్తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జేపీ నడ్డా పర్యటనను విజయవంతం చేయాలని కోరుతూ ఖమ్మం జాతీయ పదాధికారి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, భద్రాద్రికొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్ ఆధ్వర్యంలో ఇప్పటికే కొత్తగూడెంలో ముఖ్య కార్యకర్తల మీటింగ్పెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సీటును గెలుచుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ క్రమంలో లోక్‌సభ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కొత్తగూడెంలో పర్యటించనున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
కేసీఆర్ రోడ్ షో సక్సెస్‌కు పలు ప్రయత్నాలు
ఖమ్మం బీఆర్ఎస్అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ కొత్తగూడెంలో మంగళవారం రోడ్ షో నిర్వహించనున్నారు. కేసీఆర్ రోడ్ షోను సక్సెస్ చేసేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున ప్రచారం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గానూ భద్రాచలం సీటును మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. కానీ ఇటీవల ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరో వైపు కేసీఆర్ రోడ్ షోకు ముందే ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరడం పార్టీలో చర్చానీయాంశంగా మారింది. ఒక్కొక్కరుగా ముఖ్య నేతలంతా కాంగ్రెస్‌లో చేరుతుండడం ఆ పార్టీ అగ్ర నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
నేతలను సమాయత్తం చేసిన పొంగులేటి..
ఖమ్మం లోక్‌సభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న రామసహాయం రాఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెంలో శనివారం ప్రచారం ప్రారంభించారు. మిత్ర పక్షాలైన సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ లీడర్లతో కలిసి కో ఆర్డినేషన్ కమిటీలు వేశారు. ప్రచార వేగాన్ని ముమ్మరం చేసే విధంగా మంత్రి దిశా నిర్దేశం చేశారు.