చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో బడే దామోదర్‌ మృతి

  • మావోయిస్టు తెలంగాణ సెక్రటరీ మరణించారని ప్రకటించిన పార్టీ
  • 30 ఏండ్లుగా అజ్ఞాతంలో గడిపిన నేత
  • ఎన్‌కౌంటర్‌లో ఆయనతో పాటు 18 మంది మృతి
  • దామోదర్‌‌పై రూ.50 లక్షల రివార్డ్, 70కి పైగా కేసులు
  • స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి గ్రామం

జయశంకర్‌‌ భూపాలపల్లి/తాడ్వాయి/భద్రాచలం, వెలుగు: రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్‌ గ్రామంలో ఈ నెల 16న జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో మావోయిస్ట్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్‌‌ బడే దామోదర్‌‌ అలియాస్‌‌ బడే చొక్కారావు మృతి చెందారని ఆ పార్టీ సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గంగ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో దామోదర్‌‌ 30 ఏండ్ల ఉద్యమ ప్రస్థానానికి తెరపడినట్లయింది. ‌ఈ ఎన్‌‌కౌంటర్‌‌లో దామోదర్‌తో సహా 18 మంది చనిపోయారని పార్టీ ప్రకటించింది. దామోదర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా 70కి పైగా కేసులు నమోదు కాగా, ఆయనపై రూ. 50 లక్షల రివార్డ్‌ ఉంది.

ఈ నెల15వ తేదీన సాయంత్రం బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాలకు చెందిన డీఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్​కు చెందిన1500 మంది జవాన్లు ఊసూరు పోలీస్​స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్, మారేడుబాక, తుమ్లేరు, మల్లంపెంట అటవీ ప్రాంతంలోకి ప్రవేశించారు. తెలంగాణకు చెందిన ముఖ్య క్యాడర్ మొత్తం ఇక్కడే బస చేశారన్న పక్కా సమాచారంతో బలగాలు16వ తేదీ ఉదయం కూంబింగ్ ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ మూడు సార్లు ఎన్ కౌంటర్ లు జరిగాయి. ఈ ఘటనల్లో 12 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటించారు.

అయితే, ఎన్ కౌంటర్లలో మొత్తం 18 మంది మావోయిస్టులు చనిపోయారని, దామోదర్,​ దాదా, హుంగీ, దేవే, జోగా, నర్సింహారావు మృతదేహాలను తాము వెంట తీసుకెళ్లినట్టు తాజాగా పార్టీ ప్రకటించింది. మరోవైపు కేంద్ర కమిటీ సభ్యుడు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా, మిలటరీ చీఫ్ బార్సే దేవాలు ఎన్​కౌంటర్ నుంచి త్రుటిలో తప్పించుకున్నారని కూడా మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.  

ఇంటర్​లోనే అడవిబాట 

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే ఎల్లయ్య, బతుకమ్మ దంపతుల చిన్న కొడుకు బడే దామోదర్‌‌. ఇతనికి అన్నయ్య రామారావు, అక్కలు సమ్మక్క, లక్ష్మీదేవి ఉన్నారు. ఇతను బయ్యక్కపేట ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. గోవిందరావుపేట మండలం పస్రా జడ్పీహెచ్‌ఎస్‌‌లో 6 నుంచి 10 వరకు చదివారు. గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్‌‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న టైంలోనే ఉద్యమంలోకి వెళ్లారు.

మొదట ఏటూరునాగారం ఏరియా డిప్యూటీ కమాండర్‌‌, ఏరియా కమాండర్‌‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఉత్తర తెలంగాణ 3 జిల్లాల కార్యదర్శిగా, ఆ తర్వాత స్పెషల్‌‌ జోన్‌‌ స్టేట్‌  యాక్షన్‌‌ టీమ్‌‌ కమాండర్‌‌గా పనిచేశారు. ఈ మధ్యనే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీగా నియమితులయ్యారు.  

కాల్వపల్లి నుంచే ఐదుగురు..  

కాల్వపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు మావోయిస్టులు ఉద్యమంలోనే అసువులు బాశారు. దామోదర్‌‌ పెదనాన్న కొడుకు బడే నాగేశ్వర్‌‌రావు అలియాస్‌‌ ప్రభాకర్‌‌ 1980వ దశకంలో మావోయిస్టు ఉద్యమంలోకి అడుగుపెట్టారు. 2005లో తాడ్వాయి మండలం నర్సాపూర్‌‌ అడవుల్లో జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో మృతిచెందారు. ఈయన కూతురే ములుగు జడ్పీ మాజీ చైర్మన్‌ బడే నాగజ్యోతి. బీఆర్‌‌ఎస్‌ తరఫున ములుగు ఎమ్మెల్యేగా నాగజ్యోతి పోటీచేసి ఓడిపోయారు.

స్వయానా ఆయన తమ్ముడు బడే మురళి అలియాస్‌‌ పున్నం చందర్‌‌ ప్రభుత్వ టీచర్‌‌గా పనిచేస్తుండగా ఉద్యమంలోకి వెళ్లారు. 2007 నాటి ఎన్‌‌కౌంటర్‌‌లో చనిపోయాడు. ఇదే గ్రామానికి చెందిన సిద్దబోయిన అశోక్‌‌ అలియాస్‌‌ శ్రీధర్‌‌,  సిద్దబోయిన భారతక్క సైతం ఎన్‌‌కౌంటర్‌‌లో చనిపోయారు.