- విద్య, వైద్యం-ఆరోగ్యం, వ్యవసాయం, ఐటీతో సహా అన్నిట్లో మనమే టాప్
- దేశానికే తొవ్వ చూపెడ్తున్నం: గవర్నర్
- ప్రతి ఇంటికీ భగీరథ నీళ్లు అందిస్తున్నం
- దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేసినం
- పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసినం
- ఊర్లకు, పట్టణాలకు క్రమం తప్పకుండా నిధులిస్తున్నం
- పంటలు అమ్ముకోవడానికి మార్కెటింగ్,
- నిల్వ చేసుకోవడానికి గోదాముల కెపాసిటీ పెంచినం
- మాంసం ఉత్పత్తి డబుల్ అయింది
- ధరణి పోర్టల్తో భూసమస్యలు లేకుండా చేసినం
- లా అండ్ ఆర్డర్కు ప్రయార్టీ ఇస్తున్నం
- రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నం -గవర్నర్ తమిళిసై
అసెంబ్లీ, మండలిని ఉద్దేశించి ప్రసంగం
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయన్నరు. కరెంట్ లేక అంధకారం అలుముకుంటుందన్నరు. హైదరాబాద్ అతలాకుతలం అవుతుందన్నరు. ఇండస్ట్రీస్ తరలిపోతాయన్నరు. అవన్నీ తప్పని నిరూపించినం. వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నం. ధరణి పోర్టల్లో భూ సమస్యలకు పరిష్కారం చూపించినం. గ్రామాలు, పట్టణాల ప్రగతికి క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నం. సమైక్య రాష్ట్రంలో అన్ని రంగాలు విధ్వంసానికి, వివక్షకు గురైనయ్. ఇప్పుడు అన్ని రంగాల్లో అద్భుతంగా రాష్ట్రం ముందుపోతున్నది. తక్కువ టైంలోనే కరెంట్ సమస్యను పరిష్కరించినం. దేశంలోనే వ్యవసాయానికి
24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. – గవర్నర్ తమిళిసై
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం ఏర్పడిన ఆరున్నరేండ్లలోనే దేశానికి దారిచూపేలా తెలంగాణ నిలిచిందని గవర్నర్ తమిళిసై అన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయం, ఐటీ ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. వలసవాదుల కుట్రలతో కుదేలైన రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన వినూత్న పథకాలు పురోగామి రాష్ట్రంగా మార్చాయని చెప్పారు. ఆర్థికంగా ప్రగతి సాధించామని, ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి రుణాలు తెచ్చి వాటిని ప్రణాళికబద్ధంగా ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. అసెంబ్లీ బడ్జెట్సమావేశాల సందర్భంగా సోమవారం రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అంతకు ముందు అసెంబ్లీలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎం కేసీఆర్, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గవర్నర్కు ఘన స్వాగతం పలికారు. ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేసినా, వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందని గవర్నర్ పేర్కొన్నారు. వైరస్ నుంచి కోలుకున్న వారి సగటులో దేశంలోనే మెరుగైన స్థితిలో రాష్ట్రం ఉందన్నారు. కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 1,200 సెంటర్ల ద్వారా వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజా వైద్యాన్ని మెరుగు పరిచినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మాతా శిశు మరణాల రేటు తగ్గిందన్నారు. కేసీఆర్ కిట్ అద్భుత ఫలితాలు ఇస్తున్నదని చెప్పారు. ప్రభుత్వరంగంలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, సీట్ల సంఖ్యను పెంచామన్నారు.
వ్యవసాయాన్ని పండుగ చేసినం
సమైక్య రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయాన్ని తమ ప్రభుత్వం పండుగ చేసిందని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తోందన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్, దేవాదుల, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, సింగూరు, కిన్నెరసాని, పాలెంవాగు, కుమ్రం భీం, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథపూర్ తదితర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి వాటి కింద 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నట్లు వివరించారు. ఉమ్మడి రాష్ట్ర పాలకులు కేవలం 11.43 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్లు నిర్మించడానికి ప్రతిపాదించగా, తమ ప్రభుత్వం గోదావరి, కృష్ణా బేసిన్లో 342.21 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తున్నదని చెప్పారు. రైతులకు ఏడాదికి రూ. 10 వేల చొప్పున సాయం చేస్తున్నామని, రైతు ఏ కారణంతో మరణించినా ఆ రైతు కుటుంబానికి రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ సాయం అందిస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి రెండు సీజన్లలో కలిసి 1.41 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేస్తే.. ఇప్పుడు 2.05 కోట్ల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. పత్తి సాగులో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని తెలిపారు. రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి మార్కెటింగ్, నిల్వ చేసుకోవడానికి గోదాముల సామర్థ్యం పెంచామని పేర్కొన్నారు.
ఇంటింటికీ నీళ్లిస్తున్నం
మిషన్ భగీరథతో దేశంలోనే ఇంటింటికీ సురక్షితమైన తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు గవర్నర్ చెప్పారు. మారుమూల గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలకు కూడా రక్షిత నీటిని ఇస్తున్నామన్నారు. భగీరథతో రాష్ట్రానికి ఫ్లోరైడ్ పీడ విరగడ అయిందని తెలిపారు. మిషన్ కాకతీయతో రాష్ట్రంలో 45 వేల చెరువులను పునరుద్ధరించామని, దీంతో భూగర్భ జల మట్టాలు భారీగా పెరిగాయని గవర్నర్ చెప్పారు.
మాంసం ఉత్పత్తి డబుల్
రాష్ట్ర సరాసరి మాంసం ఉత్పత్తిని ప్రభుత్వం డబుల్ చేసిందని గవర్నర్ పేర్కొన్నారు. మత్స్య, కోళ్ల పరిశ్రమలు, నేత కార్మికులకు అండగా నిలుస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక నిధికి జనాభా నిష్పత్తి ప్రకారం నిధులిస్తూ అభివృద్ధికి పాటు పడుతున్నట్లు చెప్పారు.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నం
ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కి.మీ.ల అవతల సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, చౌటుప్పల్, షాద్నగర్ పట్టణాల మీదుగా 348 కి.మీ. పొడవైన రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నామని గవర్నర్ చెప్పారు. దీనికి సంబంధించిన భూ సేకరణ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో గ్రీన్ కవర్ 3.67 శాతం పెరిగిందని వివరించారు.
పోలీస్ శాఖలో పోస్టులు పెంచినం
లా అండ్ ఆర్డర్కు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని, పోలీస్ శాఖలో రాష్ట్రం ఏర్పడే నాటికి 63,181 పోస్టులు ఉంటే వాటి సంఖ్యను 86,829కి పెంచిందని గవర్నర్ పేర్కొన్నారు. పోలీసు వాహనాల సంఖ్య 5,703 నుంచి 20 వేలకు పెంచామని, దీంతో నేర సమాచారం అందిన పది నిమిషాల్లోపే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగలుగుతున్నారని అన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం దేశంలోని మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 15,252 పరిశ్రమల స్థాపనకు అనుమతులిచ్చామని, రూ.2.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 250 కిపైగా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేశారని, వీటి ద్వారా 5.82 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఐటీ ఎగుమతులు రూ. 66.27 వేల కోట్ల నుంచి రూ. 1.28 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు రూ. 1.40 లక్షల కోట్లకు చేరే అవకాశముందని నాస్కామ్ అంచనా వేసిందని పేర్కొన్నారు. హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు రోడ్ల అభివృద్ధి కార్యక్రమం చేపట్టామన్నారు. నగరంలో పెద్ద సంఖ్యలో పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
తిరుక్కురల్ పద్య పంక్తులతో ముగింపు
గవర్నర్ తమిళిసై ప్రముఖ సాధువు తిరువళ్లువర్ రచించిన ‘‘తిరుక్కురల్’’ పద్య పంక్తులతో తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘అపార సంపద ఉండటం, విపత్తులు లేకపోవడం, సమృద్ధిగా పండే పంటలు గల రాష్ట్రం ఒక ఉత్తమ రాష్ట్రం’’ అనే అర్థం వచ్చే పద్యాన్ని తన ప్రసంగం చివరలో చదివారు. 41 పేజీలతో కూడిన తన ప్రసంగాన్ని గవర్నర్ గంటా 18 నిమిషాల్లో ముగించారు.
ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు. ఆసరా పింఛన్లను పెంచామన్నారు. సమైక్య రాష్ట్రంలో పింఛన్ల కోసం రూ. 860 కోట్లు ఖర్చు చేస్తే.. ఇప్పుడు ఆ ఖర్చు రూ. 8,710 కోట్లకు పెరిగిందని, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమలతో ఊళ్లు, పట్టణాల రూపురేఖలు మారాయని పేర్కొన్నారు. ప్రతి నెల పంచాయతీలకు రూ. 308 కోట్లు, పట్టణాలకు రూ. 148 కోట్లు విడుదల చేస్తూ అభివృద్ధికి దోహదపడుతున్నామని అన్నారు. పాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలు తీసుకువచ్చినట్లు వివరించారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థకు దన్నుగా నిలిచే కులవృత్తులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు.
త్వరలో డిజిటల్ సర్వే
ధరణి పోర్టల్తో భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామని గవర్నర్ చెప్పారు. పోర్టల్ను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 1.06 లక్షల క్లెయిమ్లు పరిష్కరించామని, 3.29 లక్షల లావాదేవీలు జరిగాయన్నారు. భవిష్యత్లో భూముల సమస్య తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహించబోతున్నామని తెలిపారు. గురుకులాలతో పేద స్టూడెంట్లకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామన్నారు.
ఆరేండ్లుగా చెప్పినవే..
గవర్నర్ ప్రసంగంలో ఏమాత్రం పసలేదు. ఆరేండ్ల నుంచి చెప్పించినవే మళ్లీ చెప్పించారు. కొత్తగా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలి. 57 ఏండ్లు దాటిన వారికి పెన్షన్, నిరుద్యోగ భృతిపై ఎందుకు మాట్లాడలేదు. రేషన్లో కేవలం బియ్యం ఇవ్వడం కూడా గొప్పేనా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి ఎందుకు ప్రస్తావించలే. పట్టపగలే లాయర్ వామన్రావు దంపతుల హత్య జరిగితే శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్టా? వ్యవసాయ చట్టాలపై రాష్ట్రం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వాల్లో ఆనవాయితీగా 30 రోజులు సమావేశాలు జరిగేవి, కానీ టీఆర్ఎస్ సర్కార్ 6 రోజులే నిర్వహించడమేంటి? –సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
బీఏసీ మీటింగ్కు మమ్మల్ని పిలవరా?
అసెంబ్లీ బీఏసీ మీటింగ్కు బీజేపీని పిలువకపోవడం ఏంటి? ఒక్క సభ్యుడున్న పార్టీని కూడా పిలిచిన సంప్రదాయం ఉంది. మీకు ఇష్టముంటే పిలుస్తరు, లేకుంటే లేదా? దీనిపై స్పీకర్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి జవాబివ్వాలి. స్పీకర్ ను కలిసి నిరసన తెలియజేస్తం. బీఏసీ మీటింగ్కు ఒక జాతీయ పార్టీని పిలువక పోవడంలోనే మీ ఉద్దేశం ఏంటో తెలుస్తోంది. నియంతృత్వంగా సభను నడిపించాలను కుంటే కుదరదు. సభను ఎలా నడుపాలో టీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ కూర్చొని రాసు కుంటే సరిపోతుందా? సీఎం కేసీఆర్ బీఏసీ మీటింగ్కు రాకుండా వెళ్లిపోవడంతోనే ఆయనకు సభమీదున్న గౌరవం ఏంటో అర్థమవుతోంది. -బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
ప్రసంగంలో పేజీలు, పొగడ్తలు పెంచిన్రు: సీతక్క
హైదరాబాద్, వెలుగు : గవర్నర్తో కేసీఆర్ సర్కారు అసత్యాలు చెప్పించిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. కరోనా టైంలో ప్రభుత్వం పనితీరు నేరుగా గవర్నర్ చూశారని, కానీ బాగా చేసినట్లు ప్రసంగంలో చూపించారని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో పేజీలతోపాటు కేసీఆర్పై పొగడ్తలు పెంచారని విమర్శించారు.
భగీరథ ఏడ పూర్తయింది?: రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్తో నూటికి నూరు శాతం అబద్ధాలు చెప్పించిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మిషన్ భగీరథ పూర్తయినట్లు కేసీఆర్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, 50శాతం కూడా మిషన్ భగీరథ పనులు పూర్తి కాలేదన్నారు. ఈ ప్రభుత్వంలో దోచుకుంటున్నది సీమాంధ్ర కాంట్రాక్టర్లు కాదా అని ఆయన ప్రశ్నించారు.