
లండన్: వింబుల్డన్‌లో పెను సంచలనం నమోదైంది. టాప్ సీడ్ ఇగా స్వైటెక్ మూడో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్‌లో అన్‌సీడెడ్ యూలియా పుతినెత్సోవా (కజకిస్తాన్)3–6, 6–1, 6–2తో స్వైటెక్ (పోలెండ్)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. గంటా 59 నిమిషాల మ్యాచ్‌లో తొలి సెట్ ఈజీగా నెగ్గిన స్వైటెక్ తర్వాతి రెండు సెట్లలో తడబడింది. పుతినెత్సోవా కొట్టిన బేస్ లైన్ సర్వీస్‌లను తీయలేకపోయింది. మ్యాచ్ మొత్తంలో పుతినెత్సోవా ఒక్క ఏస్ కొట్టకపోయినా తన సర్వీస్‌లో 88 పాయింట్లను కాపాడుకుంది.
19 విన్నర్లు కొట్టిన ఆమె 15 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసింది. నాలుగు బ్రేక్ పాయింట్లను కాచుకుంది. ఇక ఐదు ఏస్‌లు కొట్టిన స్వైటెక్, రెండు డబుల్ ఫాల్ట్స్‌తో పాటు ఒక్క బ్రేక్ పాయింట్‌నూ కాపాడుకోలేకపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో ఒస్టాపెంకో (లాత్వియా) 6–1, 6–3తో పీరా (అమెరికా)పై, కలిన్‌స్కాయ (రష్యా) 7–6 (7/4), 6–2తో సమస్నోవా (రష్యా)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 6–1, 7–6 (7/4)తో ఆన్స్ జుబెర్ (ట్యూనీసియా)పై, వాంగ్ (చైనా) 2–6, 7–5, 6–3తో నెగ్గి ముందంజ వేశారు. మెన్స్ సింగిల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-–4, 6–-4, 7–-6 (7/5)తో నోరీ (బ్రిటన్)పై, షెల్టన్ (అమెరికా) 6–-7 (7/4), 6–-2, 6–-4, 4-–6, 6–-2తో షపలోవ్ (కెనడా)పై గెలవగా, మినూర్ (ఆస్ట్రేలియా)కు వాకోవర్ విజయం లభించింది.
సచిన్‌కు స్టాండింగ్ ఒవేషన్..
బ్యాగీ కలర్ సూట్‌లో సెంటర్ కోర్టులోకి వచ్చిన సచిన్ టెండూల్కర్‌కు ఫ్యాన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. భార్య అంజలితో కలిసి వచ్చిన మాస్టర్ చిరు నవ్వులు చిందిస్తూ ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఇంగ్లిష్ క్రికెటర్లు బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, జో రూట్ కూడా రాయల్ బాక్స్‌లో సచిన్‌తో కలిసి మ్యాచ్‌ను తిలకించారు.