మరి కాసేపట్లో ఇండియాకు టెర్రరిస్ట్ తహవూర్ రాణా.. ఢిల్లీ ఎయిర్‎పోర్టు వద్ద హై అలర్ట్

మరి కాసేపట్లో ఇండియాకు టెర్రరిస్ట్ తహవూర్ రాణా.. ఢిల్లీ ఎయిర్‎పోర్టు వద్ద హై అలర్ట్

న్యూఢిల్లీ: 26/11 ముంబై పేలుళ్ల కుట్రదారు, టెర్రరిస్ట్ తహవూర్ రాణా మరికాసేపట్లో భారత్‎కు చేరుకోనున్నాడు. అగ్రరాజ్యం అమెరికా తహవూర్ రాణాను ఇండియాకు అప్పగించడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( ఎన్ఐఏ) అధికారులు యూఎస్ నుంచి అతడిని స్పెషల్ ఫ్లైట్‎లో భారత్ తీసుకొస్తున్నారు. తహవూర్ రాణా రాక నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఢిల్లీ ఎయిర్ పోర్టు వద్ద హై అలర్ట్ ప్రకటించింది. 

ఢిల్లీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎయిర్ పోర్టు వద్ద భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. రాణా భారత్ చేరుకోగానే.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎన్ఐఏ అధికారులు అతడిని అరెస్ట్ చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి రాణాను ఎన్ఐఏ కార్యాలయానికి తరలించేందుకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, సెంట్రల్ ఫోర్సెస్‎తో కూడిన కాన్వాయ్ సిద్ధం చేశారు.

 స్వాట్ (స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్) కమాండోలను ఇప్పటికే విమానాశ్రయంలో మోహరించారు. మరోవైపు రాణా రాక నేపథ్యంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాణాను అరెస్ట్ చేసిన అనంతరం పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విచారణ కోసం రాణాను కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ అధికారులు కోర్టును కోరనున్నారని సమాచారం. ఇప్పటికే రాణాను ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఎన్ఐఏ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

ALSO READ : అమెరికాలో దారులన్నీ క్లోజ్.. ఎట్టకేలకు ఇండియాకు 26/11 ముంబై పేలుళ్ల ఉగ్రవాది

ఒకవేళ కోర్టు కస్టడీకి అనుమతి ఇవ్వకుండా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తే రాణాను తీహార్ జైల్ లేదా ఆర్థర్ రోడ్ జైలుకి తరలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తీహార్ జైల్, ఆర్థర్ రోడ్ జైల్‎లో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో ఆంక్షలు విధించారు. ఇదిలా ఉంటే.. తహవూర్ రాణా రాక నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‎ను నియమించింది కేంద్రం. కేంద్ర హోంశాఖ అడ్వకేట్ నరేందర్ మాన్‎ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‏గా నియమిస్తూ గురువారం (ఏప్రిల్ 10) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్ఐఏ తరుఫున నరేందర్ మాన్ వాదించనున్నారు.